భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వగీర్‌

కల్వరి క్లాస్‌ కు చెందిన 5వ జలంతార్గామ ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. ముంబయిలోని నావల్‌ డాక్‌ యార్డ్‌ లో చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ సమక్షంలో ఐఎన్‌ఎస్‌ వగీర్‌ నౌకాదళంలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ కాలంలో 24 నెలల్లోనే భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో జలంతర్గామి అని హరికుమార్‌ తెలిపారు.

కల్వరి జలాంతర్గాములలో చివరిది అయిన వగీర్‌ అధునాతన నిర్మాణమని, మార్చి, ఏప్రిల్‌లో మొదటి ఉపరితల సముద్ర దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.  యాంటీ-సర్ఫేస్‌ వార్‌ఫేర్‌, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌, ఇంటెలిజెన్స్‌ సేకరణ, మైన్‌ లేయింగ్‌ , సర్వైలెన్స్‌ మిషన్‌లతో సహా విభిన్న మిషన్‌లను చేపట్టగల సామర్థ్యాన్ని వగీర్‌ కలిగి ఉందని నావికా దళం పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లతో పాటు వైర్‌ గైడెడ్‌ టార్పిడోలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ జలాంతర్గామి నుండి సబ్‌ సర్ఫెస్‌ నుంచి సర్ఫెస్‌ కు క్షిపణులను ప్రయోగించవచ్చని, ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడిచేసే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొంది. ప్రత్యేక ఆపరేషన్ల సమయంలో శత్రు స్థావరాల్లోకి మెరైన్‌ కమాండోలను పంపిచే సామర్థ్యం కలిగి ఉందని నౌకా దళం ఓప్రకటనలో పేర్కొంది.

వగీర్‌ అంటే హిందూ మహాసముద్రంలో అత్యంత లోతులో నివసించే సాండ్‌ ఫిష్‌ పేరని, నిశ్శబ్దంగా, భయం లేకుండా పనిచేయడం వగీర్‌ ప్రధాన సామర్థ్యమని తెలిపింది. సముద్రం మధ్యలో, తీరాల సమీపంలో కూడా ఐఎన్‌ఎస్ వగీర్ జలాంతర్గామిని మోహరించవచ్చు. దేశీయంగా నిర్మించిన అత్యాధునిక జలాంతర్గాములలో ఇదొకటి.

భారతదేశం, ఫ్రాన్స్‌ సహకారంతో కల్వరి క్లాస్‌ సబ్‌మెరైన్‌లను నిర్మిస్తోంది. ప్రాజెక్టు 75లో భాగంగా నిర్మించిన 5వ సబ్‌మెరైన్‌ ఇది. 1973లో ప్రారంభించిన జలంతర్గామి పేరైన ‘వగీర్‌’ పేరునే కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్‌కి పెట్టారు. 2020 నవంబర్‌లో ఆవిష్కరించగా, అప్పటి నుండి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో ఆయుధాలు, సోనార్లతో పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు.