నేపాల్ లో భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు

పొరుగు దేశం నేపాల్‌లో ఇవాళ మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో సైతం ఈ భూకంప ప్రభావం కనిపించింది.
 
ఇవాళ మధ్యాహ్నం 2.28 గంటలకు నేపాల్‌లో 5.4 తీవ్రతో భూకంపం సంభవించిందని నేషనల్‌ సెంటర్‌ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్‌లోని కాలిక ప్రాంతానికి 12 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని పౌరీకి చేరువలో ఉంటుంది. భూకంపం ప్రభావం నేపాల్, భారత్‌తో‌పాటు పొరుగున ఉన్న టిబెట్ (చైనా)లోనూ కనిపించింది.
 
 భూమిలో 10 కిమీల లోతున సంభవించిన ఈ భూకంపం కారణంగా ఉత్తర ప్రదేశ్, బిహార్ ల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న పలువురు భూకంపం సంభవించిన సమయంలో తమ ఇళ్ళలో వస్తువులు కింద పడడం, సీలింగ్ ఫ్యాన్స్ కదలడం వంటి దృశ్యాలున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
 
దాదాపు నిమిషం పాటు భూ కంపనాలు చోటు చేసుకున్నాయని, ఆ సమయంలో భయాంధోళలకు గురయ్యామని వివరించారు. భూకంపం సమయంలో పెంపుడు జంతువుల ప్రవర్తనపై ఒక నెటిజన్ ఒక వీడియో షేర్ చేశాడు. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదు. ఢిల్లీలో భూమి కంపించడం ఈ నెలలో ఇది మూడోసారి కావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
 
కాగా, గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీతోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం ధాటికి తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ భూకంప తీవ్రత కూడా రిక్టర్‌ స్కేలుపై 5.4గా నమోదైంది. ఉత్తరాన నేపాల్‌లో, ఆగ్నేయంలో ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ వరకు భూమి కంపించింది. కానీ, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.