21 అండమాన్ దీవులకు పరమవీరచక్ర గ్రహీతల పేర్లు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జన్మదినోత్సవాన్ని  పరాక్రమ్ దివస్ గా జరుపుతున్న సందర్భంగా అండమాన్ దీవుల్లో ఇప్పటి వరకు పేరు పెట్టని 21 పెద్ద దీవులకు కేంద్ర ప్రభుత్వం పరమవీరచక్ర గ్రహీతల పేర్లతో నామకరణం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశ రక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన సైనికులను స్మరించుకుంటూ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీరచక్రను ఇప్పటి వరకు పొందిన 21 మంది సైనికాధికారులు, సైనికుల పేర్లను అండమాన్ దీవులకు పెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక నమూనాను సైతం ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

భావితరాలు చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతాయని, అండమాన్ – నికోబార్ దీవులకు ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ప్రధాన మంత్రి తెలిపారు. అమరవీరుల పేర్లు పెట్టిన 21 దీవులు నిరంతరం ప్రేరణనిస్తాయని చెప్పారు. అండమాన్ – నికోబార్ దీవుల చరిత్రను గుర్తుచేస్తూ ఇక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారతదేశంలో మొదటి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిందని ప్రధాని తెలియజేశారు.

వీర్ సావర్కర్ సహా ఆయనలా అనేక మంది ఈ నేలపై దేశం కోసం త్యాగం చేశారని చెప్పారు. అండమాన్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సెల్యూలర్ జైలు స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న కష్టాన్ని, బాధను గుర్తుచేస్తుందని తెలిపారు.

వలస పాలన నుంచి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అండమాన్ దీవుల్లోని రాస్ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా పేరు మార్చిందని ఆయన గుర్తుచేశారు.అలాగే నీల్, స్వరాజ్ దీవులు స్వరాజ్, షహీద్ దీవులుగా మారాయని తెలిపారు.