తిరుపతిలో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్

తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌ హాస్పిటల్‌లో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్‌ శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. దాత గుండెను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి అమర్చారు. అవయవాన్ని తరలించేటప్పుడు మార్గమధ్యలో ఎటువంటి అంతరాయమూ కలగకుండా పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.
 
అన్నమయ్య జిల్లా చిట్వేల్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు చిన్నతనం నుంచే గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల అది తీవ్రతరం కావడంతో తిరుపతిలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. స్విమ్స్‌ వైద్యుల సలహా మేరకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చేరాడు.  అక్కడి వైద్యులు బాలుడిని పరిశీలించి గుండె మార్పిడి తప్పనిసరని నిర్ధారించారు. దాత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన బిహెచ్‌ఇఎల్‌ (భెల్‌) ఉద్యోగి ఆనందరావు తన భార్య జంజూరు సన్యాసమ్మ (48)తో కలిసి సంక్రాంతి పండగకు సొంత ఊరు వెళ్లారు.
 
ఈ నెల 16న విశాఖ తిరిగి వస్తుండగా ఎయిర్‌ పోర్టు సమీపంలో బైకు పైనుంచి సన్యాసమ్మ జారిపడిపోవడంతో ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయింది. చికిత్స కోసం షీలానగర్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు ఇందుకు ఏర్పాట్లు చేశారు.
 
షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా శుక్రవారం అవయవాలు తరలించారు. తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి ఆమె గుండెను అమర్చేందుకు విశాఖ నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి 25 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లో చేరుకునేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
 
ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకున్న సన్యాసమ్మ గుండెను 11.52 గంటలకు తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్‌ గుండె ఆస్పత్రికి చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు ఆ గుండెను బాలుడికి అమర్చారు. సన్యాసమ్మ తాను చనిపోతూ గుండె దానం ద్వారా బాలుడి ప్రాణం నిలిపింది.