సరిహద్దుకు అత్యంత సమీపంలో డ్యామ్ నిర్మిస్తున్న చైనా

భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా ఓ డ్యామ్ నిర్మిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కేవలం భద్రతాపరంగానే కాకుండా, ఇది భారత దేశ నీటి భద్రతకు ముప్పు కలిగించే విషయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వంక శాంతి వచనాలు వల్లిస్తూనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగే విధంగా చైనా తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది.

భారత్ – నేపాల్ సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న డ్యామ్ కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకు రావడంతో ఆ దేశం అక్రమంగా చేస్తున్న నిర్మాణాలు వెల్లడయ్యాయి. టిబెట్లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో భారత్ – నేపాల్ లో  సరిహద్దును చైనా పంచుకుంటోంది.

ఈ ట్రై-జంక్షన్ కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో నేపాల్లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది భారత్ లోని గంగా నదిలో చేరిపోతుంది.  కాగా, ఈ ట్రై జంక్షన్కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలోనే చైనా ఓ డ్యామ్ను నిర్మిస్తోందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ఇంటెల్ ల్యాబ్ కు చెందిన జియోస్పాటియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ డామియన్ సిమాన్ విడుదల చేశారు. 2021 మే నుంచి ఈ డ్యామ్ కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు ఆయన వివరించారు. డ్యామ్తో నది కదలికలను నియంత్రించేందుకు చైనా భావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. డ్యామ్ పొడవు 350ఎంఎం- 400ఎంఎం మధ్యలో ఉండొచ్చు. “ప్రస్తుతం ఈ డ్యామ్ నిర్మాణ దశలోనే ఉంది. మరి దీనిని చైనా ఎలా ఉపయోగిస్తుందనేది స్పష్టంగా తెలియదు. ఈ డ్యామ్ కు సమీపంలో ఓ ఎయిర్పోర్ట్ను కూడా చైనా కడుతోంది!” అని డామియన్ సిమాన్ తెలిపారు. మబ్జా జాంగ్బో నది నుంచి దిగువకు వస్తున్న నీరును నియంత్రించి, నిల్వచేసేందుకు ఈ డ్యామ్ను చైనా వినియోగిస్తుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. నీరు ఒకేసారి విడుదల చేస్తే దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.

మౌలిక వసతుల పేరుతో సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో చైనా వివిధ కార్యకలాపాలను పెడుతుండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. టిబెట్లోని వాస్తవాధీన రేఖ వెంబడి, యర్లూంగ్ జాంగ్బో నదిపై ఓ ‘సూపర్’ డ్యామ్ను నిర్మిస్తామని చైనా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ యర్లూంగ్ జాంగ్బో నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవహించి సియాంగ్గా పేరు మార్చుకుంటుంది. అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నదిగా అసోంలోకి వెళుతుంది. చైనా కడుతున్న డ్యామ్లు ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో ఆందోళన రేకెతిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 2020 మేలో చైనా- భారత్ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటి నుంచి ఇవి మరింత తీవ్రంగా మారాయి.

సరిహద్దుల్లో మౌలిక వసతుల పేరుతో విమానాశ్రయాలు, మిసైల్- డిఫెన్స్ శిబిరాలు వంటి ఏర్పాట్లు చైనా చేసుకుంటోంది. ఇక తాజా డ్యామ్ వార్తలతో చైనా దురుద్దేశం మరోమారు స్పష్టమైందని పేర్కొన్నారు ఓఆర్ఎఫ్(అబ్సర్వర్ రీసెర్ఛ్ ఫౌండేషన్)కు చెందిన సమీర్ పాటిల్. “ఈ డ్యామ్.. భారత దేశ నీటి భద్రతకు ముప్పు కలిగించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పనులతో.. ఇప్పటికే బలహీనంగా ఉన్న బంధాన్ని, మరింత ఉద్రిక్తంగా మార్చుకుంటోంది చైనా,” అని ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా, భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తూర్పు లఢక్‌లో విధులు నిర్వహిస్తున్న తమ దేశ సైన్యంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆయన వారిని ప్రశ్నించడం చర్చనీయాంశం అయింది. అలాగే సరిహద్దుల్లో పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నిరంతరం కట్టుదిట్టంగా భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు జవాన్లు బదులిచ్చారు. ఈ సందర్భంగా జవాన్లలో ఉత్తేజం నింపిన జిన్‌పింగ్‌.. వారికి తాజా ఆహార పదార్థాలు అందుతున్నాయో లేదో వాకబు చేశారు.