ఫ్రెంచి కార్మికుల సమ్మెలు, నిరసనలు

పింఛను నిబంధనల్లో ప్రతిపాదిత మార్పులపై ఫ్రెంచి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ వయసును పెంచడం వంటి ప్రతిపాదనలు ఇందులో వున్నాయి. వీటిపై కార్మికులు మండిపడుతూ, హైస్పీడ్‌ రైళ్లను నిలిపివేశారు, విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలిగించారు.  గురువారం దేశవ్యాప్తంగా సమ్మెలకు, నిరసనలకు దిగారు.
వేలాదిమంది కార్మికులు వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రతిపాదించిన మార్పుల వల్ల ఇప్పటివరకు 62గా వున్న పదవీ విరమణ వయసును 64కి పెరుగుతుంది.  వృద్ధుల జనాభా పెరుగుతున్నందున, మరోపక్క ఆయుర్దాయం కూడా పెరుగుతున్నందున వ్యవస్ధను ఒడిదుడుకుల్లేకుండా వుంచడానికి ఈ సంస్కరణలు అవసరమని మాక్రాన్‌ ప్రభుత్వం వాదిస్తోంది.
పెన్షన్‌ నిబంధనల్లో మార్పు వల్ల ఎన్నాళ్లగానో పోరాడి సాధించుకున్న హక్కులకు భంగం వాటిల్లుతుందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.  కావాలంటే సంపన్నులపై పన్ను విధించాలని ప్రతిపాదిస్తున్నాయి. మెజారిటీ ప్రజలు ఈ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైంది. గురువారం దేశవ్యాప్తంగా 200కి పైగా ర్యాలీలు నిర్వహించారు.
 
ఈ సంస్కరణలు అన్యాయంగా వున్నాయంటూ శాంతియుతంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేయాల్సిందిగా పిలుపిచ్చినట్లు సిఎఫ్‌ఇటి యూనియన్‌ అధ్యక్షుడు తెలిపారు. సంస్కరణలను వ్యతిరేకిస్తున్న పోలీసు యూనియన్లు కూడా ఆందోళనల్లో పాల్గొన్నాయి.