బ్రిటన్ ప్రధానికి జరిమానా విధించిన పోలీసులు

సీట్​బెల్ట్​  పెట్టుకోకుండా కారులో ప్రయాణించినందుకు బ్రిటన్​ ప్రధాని రిషి సునక్​కు జరిమానా పడింది! 100 పౌండ్ల జరిమానా కట్టాలని రిషి సునక్​కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిబంధనల అమల్లో పెద్దా, చిన్నా తేడా ఉండదని నిరూపించారు బ్రిటన్​ పోలీసులు.  ఈ క్రమంలో ఏకంగా ప్రధాని రిషి సునాక్ కే  జరిమానా విధించారు. 

కొన్ని రోజుల క్రితం తన కారులో ప్రయాణిస్తున్న రిషి సునక్ ఓ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన నిధుల వివరాలను అందులో వెల్లడించారు.  దేశాభివృద్ధి కోసం తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నట్టు వివరించారు. ఈ వీడియో నిడివి దాదాపు 1 నిమిషం. అంతా బాగానే ఉంది కానీ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో కారులో వెనక భాగంలో కూర్చున్న బ్రిటన్​ ప్రధాని రిషి సునక్​  సీట్​బెల్ట్​ పెట్టుకోవడం మర్చిపోయారు.

అంతే! ఆయన చెప్పిన మాటల కన్నా “సీట్​ బెల్ట్​  పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న ప్రధాని,” అంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్​గా మారింది. అనంతరం ఈ ఘటనపై రిషి సునక్​ క్షమాపణలు చెప్పారు. “తప్పు జరిగింది. రిషి సునక్​  క్షమాపణలు చెబుతున్నారు. అందరు సీట్​బెల్ట్​ ధరించాలన్నది ఆయన అభిప్రాయం,” అని ప్రధాని ప్రతినిధి తెలిపారు.

 కాగా, ఈ వ్యవహారంపై స్పందించిన లంకెషైర్​ పోలీసు విభాగం ఘటనను పరిశీలిస్తున్నట్టు వివరించింది. సీట్​ బెల్ట్​ పెట్టుకోని కారణంగా  ప్రధానిపై 100 పౌండ్ల జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. రిషి సునక్​ను 42 ఏళ్ల లండన్​వాసిగా సంబోధించింది!