బీపీఎల్ కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నెలకు రూ. 2 వేలు

దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ. 2,000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, రాబోయే బడ్జెట్‌లో ఈ నిర్ణయం ప్రకటిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక మంగళవారం తెలిపారు. కల్బుర్గి (కర్ణాటక): తాము కర్ణాటకలో అధికారంలోకి వస్తే కుటుంబ పెద్ద అయిన ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన మరుసటి రోజే బీజేపీ నేత ఈ నిర్ణయం ప్రకటించారు.

మంగళవారం రాత్రి మాచనాల తండాలో బస చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు రూ. 2 వేలు ఇస్తామని ప్రకటించారని, అది జూలై నుంచి వర్తిస్తుందని, అయితే తాము మాత్రం వెంటనే ప్రారంభించబోతున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై దీనిపై మరింత సమాచారం ఇస్తారని ఆయన తెలిపారు. ప్రియాంక గాంధీ కార్యక్రమంపై కూడా అశోక విరుచుకుపడ్డారు, ‘మేం నేను నాయకుడిని, నేను నాయకురాలిని అని అనడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా చెప్పినట్లు మేమంతా సేవకులం’ అని అంటూ ఎద్దేవా చేశారు. కాగా గత 75 ఏళ్లుగా చేయని పనిని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిందని కర్ణాటక రెవెన్యూ మంత్రి పేర్కొన్నారు.