ఇస్లామిక్ న్యాయ వ్యవస్థను కోరుకునే సంస్థలను అనుమతించం

భారత దేశంలో ఇస్లామిక్ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుకునే సంస్థలను అనుమతించజాలమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపింది. లౌకిక సమాజంలో అటువంటి సంస్థలు కొనసాగడానికి అవకాశం ఇవ్వకూడదని తెలిపింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ మువ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధం విధించడాన్ని సమర్థించుకుంటూ కౌంటర్ అఫిడవిట్‌‌ను దాఖలు చేసింది.

‘‘భారత దేశంలో ఇస్లామిక్ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగల ఏ సంస్థ అయినా మనుగడ సాగించేందుకు అనుమతించరాదు. లౌకిక సమాజంలో అటువంటి సంస్థలు కొనసాగడానికి అవకాశం ఇవ్వకూడదు’’ అని ఈ కౌంటర్ అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సిమిపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ విధంగా స్పందించింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్ 2019లో జారీ చేసిన ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిని మాజీ సిమి సభ్యుడు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఇస్లాం ప్రచారం కోసం, జీహాద్‌కు మద్దతు పొందడం కోసం యువత, విద్యార్థులను కూడగట్టాలనేది సిమి లక్ష్యమని, ఈ సంస్థ లక్ష్యాలు మన దేశ చట్టాలకు విరుద్ధమైనవని పేర్కొంది. 2001 సెప్టెంబరు 27న ఈ సంస్థపై నిషేధం విధించినప్పటికీ, కొద్ది కాలం మినహా, ఈ సంస్థ సభ్యులు నిత్యం సమావేశమవుతున్నారని, ఆయుధాలు సేకరిస్తున్నారని, దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కుట్రలు పన్నుతున్నారని తెలిపింది.

విదేశాల్లోని సిమి సూత్రధారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపింది. ఈ సంస్థ తన చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నందువల్ల 2019లో మరోసారి నిషేధం విధించవలసిన అవసరం ఏర్పడిందని చెప్పింది. దాదాపు 40 ఫ్రంట్ ఆర్గనైజేషన్ల ద్వారా దీని కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపింది.

ఈ సంస్థ భావజాలాన్ని ప్రచారం చేయడం, నిదులను సేకరించడం వంటి అనేక కార్యకలాపాల్లో ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్లు దీనికి సహకరిస్తున్నాయని పేర్కొంది. ఈ అఫిడవిట్‌పై రిజాయిండర్ దాఖలు చేయడానికి సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా వాయిదాను కోరారు. అందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది.