జనాభాలో చైనాను అధిగమించిన భారత్!

జనాభాలో చైనాను భారత్‌ అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ అవతరించినట్టు వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ ప్రకటించింది. 2022 చివరి నాటికి భారత జనాభా 141.7 కోట్లని, 2023 జనవరి 18 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకొన్నట్టు తెలిపింది. మాక్రోట్రెండ్స్‌ అనే సంస్థ కూడా మన దేశ జనాభా 142.8 కోట్లకు చేరిందని అంచనా వేసింది.

గత 60 ఏండ్లలో తొలిసారిగా చైనా జనాభా తగ్గినట్టు తాజా నివేదికలు వెల్లడించగా,  ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లని ఆ దేశం ప్రకటించింది. చైనా జనాభాను భారత్‌ 2023 చివరి నాటికి అధిగమిస్తుందని ఐక్య రాజ్యసమితి ఇదివరకు అంచనా వేసినప్పటికీ, ఈ రికార్డును భారత్‌ ఇప్పటికే అధిగమించినట్టు వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెల్లడించింది.

భారత్ జనాభా పెరుగుదల నెమ్మదించినా కూడా 2050 వరకు పెరుగుతూనే ఉంటుందని, అప్పటికి దేశ జనాభా 167 కోట్లకు చేరుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. కాగా, ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించే మన దేశంలో 2021లో కరోనా కారణంగా జనగణన జరగలేదు.

2022 నుంచి 2050 వరకు పెరగనున్న ప్రపంచ జనాభాలో సగం భారత్‌ సహా మరో ఏడు దేశాల నుంచే ఉంటుందని ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా పేర్కొంది. మన దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్‌ అని నిపుణులు పేర్కొంటున్నారు.

వ్యవసాయ రంగంలో ఉపాధి నుంచి దేశం దూరమవుతున్నందున, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాల్సి ఉందని సూచిస్తున్నారు. దేశ జనాభాలో సగం మంది 30 ఏళ్ల లోపు వారేనని, ప్రతి యేటా లక్షల సంఖ్యలో యువత శ్రామికశక్తిగా మారుతుందని, వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశ పౌరుల సగటు వయసు 28.7 ఏళ్లు కాగా.. చైనా పౌరుల సగటు వయసు 38.4గా ఉండడం గమనార్హం. జపాన్‌లో ఇది ఏకంగా 48.6 (నడివయస్సు) కాగా.. అంతర్జాతీయ సగటు 30.3 ఏళ్లు. అంటే భారతీయుల సగటు వయసు అంతర్జాతీయ సగటు కన్నా తక్కువ. 2011కు ముందు మనదేశ జనాభా ఏటా సగటున 1.7 శాతం మేర పెరిగేది. 2011 నుంచి ఆ సంఖ్య 1.2 శాతానికి తగ్గింది. అదే సమయంలో చైనాలో జనాభా వార్షిక సగటు వృద్ధి రేటు మైనస్‌ 0.6 శాతానికి పడిపోయింది. 
భారతీయుల సగటు జీవితకాలం (లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్‌ బర్త్‌) 2020 నాటికి 70.1 ఏళ్లుగా ఉంది. 1950లో ఇది కేవలం 41.7 ఏళ్లుగా ఉండేది. చైనాలో 1950 నాటికి 43.7 ఏళ్లుగా ఉన్న సగటు జీవితకాలం 2020 నాటికి 78.1 ఏళ్లకు చేరింది.