కర్ణాటక యూత్‌ పాలసీకి స్వామి వివేకానుందుడే స్ఫూర్తి

కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన యూత్‌ పాలసీకి స్వామి వివేకానుందుడే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు.  ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆయన 26వ జాతీయ యువజనోత్సవాల ముగింపు వేడుకలో పాల్గొంటూ విద్య, క్రీడలు, సంస్కృతి, వ్యక్తిత్వ వికాసాలకు ప్రాధాన్యతనిస్తూ స్వామి వివేకానుందుడి సందేశాలతో ప్రేరణ పొంది యూత్‌పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు.
 
 స్వామి వివేకానంద యువశక్తి సంఘాల పథకాన్ని రూపొందించామని, తద్వారా 5 లక్షల మంది యువతకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నామని పేర్కొన్నారు. అమృత క్రీడా పథకం ద్వారా 75 మంది క్రీడాకారులను దత్తతకు తీసుకుని వారిని ఆయా క్రీడాంశాలలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గ్రామీణ క్రీడోత్సవాల ద్వారా కొత్త ప్రతిభలకు ప్రో త్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
 
 జాతీయ యువజనోత్సవాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భిన్న భాషలు, భిన్న సంస్కృతుల యువత హాజరైందని అందరి హృదయం భారత మాతకోసమే పరితపించిందని బొమ్మై తెలిపారు. లక్ష్యాలను అందుకునేంతవరకు యువత విశ్రమించరాదని, ఇందుకు కఠోర శ్రమ కూడా అవసరమేనని పేర్కొన్నారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించే విషయంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని సీఎం చెప్పారు.
 
ఆత్మనిర్భర, ఆత్మవిశ్వాసంతోనే భారత నిర్మాణం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్యద్వారా యువత గొప్ప శిఖరాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. యువజనోత్సవం భారీగా విజయవంతమయ్యేందుకు సహకరించిన అందరినీ సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.
 
ఇలా ఉండగా, ప్రియాంకను నాయకురాలిగా ప్రకటించుకునే దుస్థితి వందేళ్లకుపైగా చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్‌కు రావడం విచారకరమని ముఖ్యమంత్రి  బొమ్మై తెలిపారు. బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ సమావేశంపై ఘాటుగానేస్పందిస్తూ
ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లోనూ, గుజరాత్‌ శాసన సభ ఎన్నికల్లోనూ ప్రియాంక ప్రచారం చేసినా కాంగ్రెస్‌ చతికిలపడిందని గుర్తు చేశారు.ప్రియాంకసభను అసమర్థుల (నాలాయక్‌) సమావేశంగా అభివర్ణించారు.