9 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి తీరాల్సిందే.. నడ్డా పిలుపు

చారిత్రాత్మక విజయాన్ని అందించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితోఈ సంవత్సరం ఎన్నికలు జరుగనున్న తొమ్మిది రాష్ట్రాలలో కూడా బిజెపి గెలిచి తీరాల్సిందే అంటూ బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడుతూ ఇవి కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదని, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలు కీలకమని తెలియజేశారు.
 
గత ఏడాది చివర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని తన సొంత భుజాలపై మోస్తూ పార్టీకి చరిత్రాత్మక ఘన విజయాన్ని అందించారని సమావేశంలో జేపీ నడ్డా కొనియాడారు. ప్రధానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 
 కాగా, హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ పరాజయాన్ని గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువే అని జేపీ నడ్డా చెప్పారు.  ఇదివరలో  ఓటమి చెందిన పార్టీకి ఐదు శాతం ఎక్కువ వరకు ఓట్లు వచ్చేవని, ఇప్పుడు కేవలం 37,000 ఓట్ల తేడా వచ్చిందని తెలిపారు.  అయితే, ఆ మాత్రం కూడా తేడా లేకుండా మనం మరింత కష్టపడి పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణాలో లభిస్తున్న ప్రజాస్పందనను చూస్తుంటే అక్కడ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా కలుగుతుందని తెలిపారు.
 
మోదీ హయాంలో భారత దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం కాగా, వాహన తయారీ రంగంలో 3వ అతిపెద్ద దేశంగా ఉందని నడ్డా కొనియాడారు. ఇక దేశంలో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ వేగం సగటున రోజుకు 12 కి.మీ నుంచి 37 కి.మీ వరకు పెరిగిందని గుర్తుచేశారు.
 
కేవలం అభివృద్ధి పనులే కాకుండా నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందని, అలాగే ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తుందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఘనత గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని చెప్పారు.
తొలి రోజు పూర్తిగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో గెలు న్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలుపు వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తున్న బిజెపి ఈ క్రమంలో తాము బలహీనంగా ఉన్న పోలింగ్ బూత్‌లను గుర్తించి, బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లి అందరికీ అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వానికి అధిష్టానం సూచించింది.
 
దేశంలో దాదాపు 72 వేల బూత్‌లను గుర్తించామని, 1.32 లక్షల బూత్‌లను బీజేపీ నాయకత్వం చేరుకుందని వెల్లడించారు. బూత్ సశక్తీకరణ్ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించడంపై ఈ సమావేశాల్లో చర్చించారు.  తొలుత పటేల్ చౌక్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో చేపట్టి కన్వెన్షన్ సెంటర్ వరకు వచ్చారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ఎస్. జైశంకర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్‌ షో కు నీరాజనం పలుకుతూ పూలజల్లు కురిపించారు.