జమ్మూ-కశ్మీరులో హింసను తిరస్కరిస్తున్న సాధారణ ప్రజానీకం

జమ్మూ-కశ్మీరులో సాధారణ ప్రజానీకం హింసను తిరస్కరిస్తోందని సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే చెప్పారు. అయితే కొన్ని ప్రాక్సీ టెర్రరిజం గ్రూపులు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాక్సీ టెర్రరిస్టులు దాడులు చేయడానికి ప్రయత్నించినపుడు, వారిని మట్టుబెడుతున్నట్లు తెలిపారు.
 
ఈశాన్య భారత రాష్ట్రాల్లో రాడికలైజ్డ్ గ్రూపులు ప్రధాన జీవన స్రవంతిలో చేరడానికి ప్రభుత్వ చర్యలు దోహదపడుతున్నట్లు తెలిపారు. బెంగళూరులో ఆదివారం ఉదయం జరిగిన ఆర్మీ డే పెరేడ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ డే పెరేడ్ ఢిల్లీకి వెలుపల జరగడం ఇదే మొదటిసారి. 1949లో ఈ వేడుకలను ప్రారంభించారు.
 
బెంగళూరులోని హలసూరులో మద్రాస్ ఇంజినీర్ గ్రూప్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన ఆర్మీ డే పెరేడ్‌ను ఉద్దేశించి జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ పంజాబ్, జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.  వీటిని నిరోధించేందుకు కౌంటర్ డ్రోన్ జామర్స్‌ను ఉపయోగిస్తున్నామని చెప్పారు.
 
చొరబాట్లను నిరోధించే యంత్రాంగం మన దేశంలోకి చొరబడేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను విఫలం చేస్తున్నట్లు తెలిపారు.  భారత దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెబుతూ వాస్తవాధీన రేఖ వెంబడి ఎటువంటి ఆగంతుకత ఏర్పడినప్పటికీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏ క్షణంలోనైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ దీనిలో భాగంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు.
 
పశ్చిమ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతోందని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన సంఘటనలు తగ్గినట్లు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సైబర్ స్పేస్, విధ్వంసకర టెక్నాలజీల ప్రాధాన్యం తేటతెల్లమవుతోందని చెప్పారు. ఇదిలావుండగా, ఆర్మీ డే వేడుకల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యాన్ని ప్రశంసించారు. ప్రతి భారతీయుడు తమ సైన్యాన్ని చూసి గర్వపడతారని చెప్పారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:  “ఆర్మీ డే సందర్భంగా, సైనిక సిబ్బందికి, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి భారతీయుడు మన సైన్యాన్ని చూసి గర్వపడుతున్నాడు. వారికి సదా  కృతజ్ఞతలమై ఉంటామని పేర్కొంటున్నారు.  వారు వెయ్యి కళ్లతో  కాపలా కాస్తూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నారు. సంక్షోభ సమయాల్లో  వారి సేవలకు విస్తృత ప్రశంసలు అందుకుంటున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.