కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టింది ఎంతమాత్రం భారత్ జోడో యాత్ర కాదని, ఇది భారత్ టోడో యాత్ర అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. ఇండియా టీవీ చీఫ్ ఎడిటర్ రజత్ శర్మతో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో నడ్డా భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ.. ”ముందు ఆయనను సజావుగా యాత్రను ముగియనీయండి. ఇప్పటికైనా ఆయన మొదటిసారి ఇల్లు విడిచి బయటకు వచ్చారు. రియల్ ఇండియా ఏమిటో చూసే అవకాశం ఆయనకు కలిగింది” అని పేర్కొన్నారు.
విద్వేష వ్యాప్తిని తొలగించేందుకు, ప్రేమభావాలను విస్తరింపజేసేందుకు యాత్రను చేపట్టినట్టు రాహుల్ చెబుతున్నారు కదా అని అడిగినప్పుడు, ఏ నేత అయినా గతంలో ఏమి మాట్లాడారో ఒకసారి విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. ”ఆయన (రాహుల్) జేఎన్‌యూకు వెళ్లినప్పుడు అక్కడి వారు పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆయన గుర్తు చేశారు.
అఫ్జల్ గురును చంపిందెవరు? సుప్రీంకోర్టు జడ్జిలా? అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనా? రాహుల్ అక్కడకు వెళ్లి వారితో కలిసికట్టుగా పోరాటం చేస్తానని చెప్పారు. జేఎన్‌యూ నుంచి వచ్చిన వాళ్లలో ఒకరు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాహుల్‌గాంధీతో కలిసి నడిచారు. వీళ్లు భారత్‌ను ఐక్యం చేసేవాళ్లా? విభజించాలని చూసేవాళ్లా? అంటూ నడ్డా ప్రశ్నించారు.
రాహుల్ మన సాయుధ బలగాల నైతక స్థైర్యాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ కంటే మన సాయుధ బలగాల నైతికతను బలహీనపరచే ప్రయత్నం చేసినవారెవ్వరూ లేరని స్పష్టం చేశారు. సర్జికల్ దాడులు, బాలాకోట్‌లో ఐఏఎఫ్ ఆపరేషన్‌ను రాహుల్ ప్రశ్నించారని, ఇటీవల మన బలగాలను కొట్టారంటూ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.
”ఈ పదాలను వాడిన వారెవరు? బలగాల నైతిక స్థైర్యాన్ని దిగజార్చిందెవరు? రాహుల్ గాంధీకి మన బలగాల పట్ల సదుద్దేశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. మన సరిహద్దులను పూర్తి శక్తియుక్తులతో సైనికులు కాపాడుతున్నారు” అని నడ్డా నిలదీశారు.
భారతీయ జనతా పార్టీ ఇంతవరకూ 277 మంది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిందని, ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే రూ.20 కోట్లు తీసుకుంటే, అది రూ.5,5000 కోట్లు అవుతుందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నడ్డా తిప్పికొట్టారు. కేజ్రీవాల్ మాటలను సీరియస్‌గా పట్టించుకునేది ఎవరని ప్రశ్నించారు.
తాను నిజమైన నిజాయితీపరుడనని ప్లకార్లులు పట్టుకున్న నేతను తాను మొదటిసారిగా చూశానని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత ఆధారంగానే ఎవరైనా నాయకుడు అవుతారని, ఒకరోజు కార్యక్రమంతో మొక్కుబడిగా సరిపుచ్చుకునే వారు నాయకుడు కాలేరని కేజ్రీవాల్‌ను విమర్శించారు. కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేను ఎందుకు విడిచిపెట్టారని అడిగిన ప్రశ్నకు నడ్డా సమాధానమిస్తూ, ఆయన నీడను చూసి కూడా భయపడటం మొదలుపెట్టారని విచారం వ్యక్తం చేశారు. నితీష్‌కుమార్‌కు తమ పార్టీ (బీజేపీ) ఇచ్చిన గౌరవం ఏ పార్టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
బీహార్ ప్రగతి కోసం ఆయనకు తాము పూర్తిగా సహకరించామని చెబుతూ ఇవాళ బీహార్‌లో పరిస్థితి ఏమిటనేది ప్రతి ఒక్కరికి తెలుసునని చెప్పారు. ఈరోజు కూడా బీహార్‌లో ఒంటరిగా పోటీకి వెళ్లే సామర్థ్యం బీజేపీకి ఉందని, భాగస్వాములను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని బిజెపి అధ్యక్షుడు భరోసా వ్యక్తం చేశారు.
జేడీయూతో తెగతెంపులు చేసుకోనున్నారా? అనే అడిగినప్పుడు, ఎవరైనా తమ కుటుంబాన్ని వదిలి మాతో రావాలని కోరుకుంటే వారిని ఆపమని చెప్పారు. తమ రాజకీయ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి, సమాజానికి మేలు చేయగలమని భావించే వారెవరైనా సరే వారిని పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు.
గత 8 ఏళ్లలో ఎన్డీయేను 19 పార్టీలు విడిచిపెట్టాయి కదా అని ప్రశ్నించగా, కొందరు ఏదో ఒక ఎజెండాతో ఎన్డీయేను విడిచిపెట్టారని, కొందరు కుటుంభం ఎజెండాతో వెళ్లిపోయారని తెలిపారు. అయితే, తాము మాత్రం ఎవరినీ వదులుకోలేదని నడ్డా స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలకు చిన్న గోల్స్ ఉంటాయని, వారు విస్తృత లక్ష్యాలున్న భారతీయ జనతా పార్టీతో ఎలా పోటీపడగలరని ఆయన ప్రశ్నించారు. సైద్ధాంతిక నిబద్ధత, ఆర్థిక అంశాలపై అవగాహన కలిగిన పార్టీ మాత్రమే మరింత పురోగమనం సాధిస్తుందని స్పష్టం చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు