పాక్‌కు వ్యతిరేకంగా భారత్ లో కలుస్తామంటున్న పీఓకే ప్రజలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. తాము భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్నారు. తన ప్రాంతాన్ని దోపిడి చేసి పంజాబ్, సింధ్ ప్రాంతాలకు పెడుతున్నారంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
దీంతో అక్కడ లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆందోళన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా గోధుమల కోసం ప్రజలు కొట్టుకు చస్తున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమపిండి ధర రూ. 150  వరకు ఉంటే, అదే గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది.
 
దీంతో పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పీఓకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్ తో కలపాలని, కార్గిల్ రోడ్ తెరవాలని లక్షల మంది నినదిస్తూ ర్యాలీలు చేశారు. గత 12 రోజులుగా ఈ ప్రాంతంలో నిరసనలు చెలరేగుతున్నాయి. మరోవైపు భారత్ ఎప్పుడైనా పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ పై దాడి చేస్తుందో అనే భయంలో పాకిస్తాన్ ఉంది. దీంతో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పాక్ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో అక్కడి స్థానికులను వేరే ప్రాంతానికి తరలిస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి.
 
గిల్గిట్ – బాల్టిస్తాన్‌లకు స్వాధీనం చేసుకుంటామని గత అక్టోబర్ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. భారత సైనాధికారులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో పాకిస్తాన్ లో భయాలు పెరిగాయి.  దాదాపుగా 70 ఏళ్ల తరువాత పాక్ పరిస్థితి నేపథ్యంలో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రజలు భారత్ లో కలుస్తామని సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. గతంలో భారత్ లో చేరమని ఉద్యమాలు, యుద్ధం చేసిన వారు ఇప్పుడు భారత్ లో చేరుతామని చెబుతుండటం విశేషం.