ఢిల్లీలో పడిపోతున్న గాలి నాణ్యత, పెరుగుతున్న వాయు కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది. దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలో శనివారం ఉదయం ఎయిర్‌ ఇండెక్స్‌ క్వాలిటీ (ఎక్యూఐ) 337గా నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎస్‌ఎఎఫ్‌ఎఆర్‌) సమాచారం ప్రకారం ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో 357, పూసా టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో 329, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 326 గా ఎక్యూఐ నమోదయ్యాయి.
 
అలాగే ఢిల్లీ ఐఐటి చుట్టుపక్కల ప్రాంతంలో 337, మధుర రోడ్‌లో 349, లోధి రోడ్‌ ప్రాంతంలో 327గా ఏక్యూఐ నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం ఢిల్లీలో శనివారం ఉదయం 11.6 డిగ్రీల సెల్సియన్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో అక్కడ చలిగాలులు వీస్తున్నట్లు ఐఎండి పేర్కొంది.
 
రాబోయే రెండు రోజులు 15, 16 తేదీల్లో వాయువ్య భారతదేశంలో చలిగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని, మరోసారి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. జనవరి 15న పంజాబ్‌, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశముందని ఐఎండి అంచనా వేసింది.

ఉత్తరాది రాష్ట్రాలపై మంచు దుప్పటి

కాగా, ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రినాథ్‌ ఆలయాన్ని మంచుదుప్పటి కప్పేసింది. ఆలయ పరిసరాల్లో కనుచూపుమేర హిమపాతం పరుచుకుంది.
 
చమోలీ జిల్లాలోని పలు ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. జోషీమఠ్‌ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది.  హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఇండ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. సిమ్లా, మనాలీలోని పలు ప్రాంతాల్లో శ్వేత వర్షం అలుముకొంది.
 
ముఖ్యంగా నరకంద ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇండ్లు, కార్లపై మంచు పేరుకుపోయింది. అక్కడ రహదారిని హిమపాతం ముంచెత్తింది. రోడ్డుకు ఇరువైపులా భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.