“కంటి వెలుగు” పేరుతో హిందువులను వేధిస్తున్న కేసీఆర్

`కంటి వెలుగు’ కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బందికి పండుగ సెలవులను హరించి వేయడం దుర్మార్గమని విశ్వహిందూ పరిషత్ విమర్శించింది. 14, 15వ తేదీలలో సంక్రాంతి పండుగ ఉంది. అది కూడా రెండవ శనివారం, ఆదివారం- రెండు రోజులు సెలవు దినాలే. సోమవారం రోజు ఆప్షనల్ తీసుకోవచ్చు.
 
కానీ సహజ సిద్ధంగా వచ్చిన రెండో శనివారం, ఆదివారం పండుగ పూట సెలవులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసి, వైద్య విభాగం లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ విధులకు రావాలని చెప్పడం దుర్మార్గం అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  హిందువుల పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం హిందూ వ్యతిరేక చర్యల్లో భాగమే అని స్పష్టం చేసింది.
 
కంటి వెలుగు కార్యక్రమంలో విధులు నిర్వహించేలా బలవంతంగా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడాన్ని పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఖండించారు.
 
 పండగ పూట కుటుంబ సభ్యులతో గడపాల్సిన ఉద్యోగులను ఆదివారం రోజు కూడా విధులకు హాజరు కావాలని హిందూ వ్యతిరేక ప్రభుత్వం బలవంత పెట్టడం దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రత్యేకమైన సెలవు దినాలు ప్రకటిస్తూ, అవసరం లేకున్నా ఆప్షన్ హాలిడేస్ ఇస్తూ ఇతర మతస్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని వారు గుర్తు చేశారు.
 
కానీ హిందువుల పండుగల విషయంలో మాత్రం సంపూర్ణమైన వివక్ష కనబరుస్తోందని ఆరోపించారు. పండుగ సెలవు దినాలలో రెండో శనివారం, ఆదివారం కూడా వాడుకోకుండా కుటుంబ సభ్యులకు దూరం చేయడం హిందువుల పండుగలను జరుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా విధులు నిర్వహించాలని సర్క్యులర్ జారీ చేయడం తగదని హెచ్చరించారు. 

ఇదే విషయమై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కమిషనర్ లతో మాట్లాడేందుకు  పరిషత్ నేతలు ప్రయత్నించినా వారిరువురు ఫోన్ లో అందుబాటులోకి రాలేదని విచారం వ్యక్తం చేశారు.