కోడికత్తి కేసులో జగన్ హాజరు కావాల్సిందే

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే, ధర్మాసనం సిఎం పేరును నేరుగా ప్రస్తావించకుండా బాధితుడు కోర్టుకు హాజరై తీరాలని పేర్కొంది.
 
విశాఖపట్నం విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి బాధితుడన్న సంగతి తెలిసింది. ఈ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారం ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణ అనంతరం పిటిషన్‌ను డిస్మిస్‌ చేసి 31వ తేదికి విచారణను వాయిదా వేసింది.
 
ఈ సందర్భంగా ఈ కేసులో బాధితుడు ఇంతవరకు కోర్టుకు రాలేదని ప్రస్తావించింది. బాధితుడిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించింది. దీనికి ఎన్‌ఐఏ న్యాయవాది బదులిస్తూ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని వివరించారు. స్టేట్‌మెంటు రికార్డు చేస్తే ఛార్జిషీటులో ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం మరోమారు ప్రశ్నించింది.
 
బాధితుడిని విచారించకుండా మిగిలిన సాక్షులను ఎంత విచారించినా ఉపయోగం లేదని తెలిపారు.  ‘‘మీరు చెప్పినట్టు వినడానికి న్యాయస్థానం టేప్‌రికార్డర్‌ కాదు. కేసులో అసలు బాధితుడ్ని (వైఎస్‌ జగన్‌) విచారించకుండా మిగిలిన సాక్షులను విచారించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది?” అని విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తిప్రశ్నించారు. 
 
 ముందు బాధితుడ్ని విచారించిన తర్వాతే మిగిలిన సాక్షులకు సమన్లు జారీ చేస్తాం. బాధితుడు విచారణకు హాజరుకావాల్సిందే నని స్పష్టం చేశారు.  కేసులో ఎల్‌డబ్ల్యూ 1 (దినేశ్‌కుమార్‌- ఎయిర్‌పోర్టు అసిస్టెంట్‌ కమాండెంట్‌), ఎల్‌డబ్ల్యూ 2 (వైఎస్‌ జగన్‌) వాంగ్మూలం కీలకం. ఆయనను విచారించిన తర్వాతే మిగిలిన కేసు ప్రొసీజర్‌ను మొదలుపెడతాం. బాధితుడు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందే’’ అని తేల్చి చెప్పారు.
 
కాగా, ఈ కేసు విచారణకు న్యాయస్థానం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 31వ తేదీ నుంచి కేసు ట్రయల్‌ ప్రారంభిస్తామని న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి తెలిపారు. ఆ రోజు నుంచి కేసులో సాక్షులను విచారించడం మొదలుపెడతారు.