
ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెం.1ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23 వరకు జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్దంగా ఉందని, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
జీవోకు వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో జగన్ సర్కార్ జనవరి 2న తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై రగడ కొనసాగుతుంది. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు.
ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము రోడ్లపైకి రావొద్దని, ప్రజలను కలవొద్దనే ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందని టీడీపీ, జనసేన ఆరోపించింది. రామకృష్ణ లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేయగా ఈ పిటీషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిల్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్షాలను ఆడుకోడానికి సర్కార్ ఈ జీవోను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవన్నీ రాజకీయ పరమైన వాదనలే అని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సభలు, సమావేశాలను నిషేధించలేదని నిబంధనల మేర సమావేశాలు నిర్వహించుకోవాలని జీవోలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈనెల 20న జీవో నెంబర్ 1పై దాఖలు చేసిన పిటీషన్ పై మరోసారి ఇరువైపులా వాదనలను కోర్టు విననుంది.
సీఎం జగన్ నూతన సంవత్సర కానుకగా కొత్త ఏడాదిని విపక్షాలపై ఉక్కుపాదంతో ఆయన ప్రారంభించారు. రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేపట్టరాదంటూ రాష్ట్ర హోం శాఖ గుట్టుగా ఉత్తర్వులు జారీచేసింది. జాతీయ రహదారులు మొదలుకొని పట్టణ, గ్రామీణ పంచాయతీ రోడ్ల మీద కూడా జనం గుమిగూడేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే మున్సిపల్ రోడ్లు, కూడళ్ల వద్దకు సైతం జనం గుంపుగా రావడానికి వీల్లేదని తెలిపింది. 30 పోలీస్ యాక్టుకు పదును పెడుతూ ఈ ఆదేశాలిచ్చింది.
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ