గుడిమల్కాపూర్ బిజెపి కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి

జిహెచ్ఎంసిలోని వార్డు నంబర్ 71 గుడిమల్కాపూర్ కార్పొరేటర్, బీజేపీ నేత దేవర కరుణాకర్ అనారోగ్యంతో చనిపోయారు. గురువారం రాత్రి  బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు.

దీంతో దేవర కరుణాకర్ పట్ల నివాళులు అర్పించేందుకు  ఆయన అభిమానులు, పార్టీ నేతలు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి దేవర కరుణాకర్ మూడు సార్లు కార్పొరేటర్ గా గెలుపొందారు.  గతంలో ఆయన  కూతురు భవాని (29) కరోనాతో మృతి చెందారు. ఆమెకు భర్త కార్తీక్, ఓ బాబు ఉన్నాడు.

కార్పొరేటర్ కరుణాకర్ చనిపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  పార్టీ తరపునే కాకుండా  వ్యక్తిగతంగానూ సేవా కార్యక్రమాలు కూడా చేసేవారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. బోజగుట్టలో పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పొరాడారన్నారు. బీజేపీ ఒక మంచి, క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయిందన్నారు.  బీజేపీతో కరుణాకర్ కు ఉన్న బంధం విడదీయలేనిదని తెలిపారు.

కరుణాకర్ మృతిపట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేసిన కరుణాకర్ .. ప్రజలందరికీ సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు గౌరవించి ఆత్మీయంగా పిలుచుకునే వ్యక్తి లేడనే వార్త తనని బాధిస్తోందని సంజయ్ తెలిపారు. కరోనా సమయంలో  కరుణాకర్ పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలిచారని సంజయ్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర మరువులేదని సంజయ్  చెప్పారు.

కరుణాకర్ మరణ సమాచారం అందిన వెంటనే మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి హుటాహుటిన సిటీ న్యూరో హాస్పిటల్ కు వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. కార్పొరేటర్ గా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వారనీ, అన్ని పార్టీల కార్పొరేటర్ల తో చాలా మంచిగా, సఖ్యతగా సౌమ్యుడు గా ఉండే వారనీ గుర్తు చేసుకున్నారు. జిహెచ్ఎంసిలో కౌన్సిల్ సమావేశం లోను సభ సజావుగా జరిగేందుకు సహకరించేవారనీ మేయర్ గుర్తు చేసుకున్నారు.