తెలుగు వారికి కేంద్రం సంక్రాంతి కానుకగా ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ను ముందుగా అనుకున్నట్లు ఈ నెల 19న కాకుండా సంక్రాంతి పర్వదినం రోజునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రారంభిస్తారు. అయితే వర్చ్యువల్ గా ప్రారంభిస్తారు. జనవరి 15న సికింద్రాబాద్ – విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభించనున్నాను.
 
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సంక్రాంతి పండగ సమయంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాలుగు రోజుల ముందే ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. 
 
దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా  విశాఖపట్టణం చేరుకోనుంది. విశాఖపట్న-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణ దూరం 700 కి.మీ. కాగా, ఈ రైలు కేవలం 8.40 గంటల్లోనే గమ్యస్థానం చేరుస్తుందని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.
 
తొలుత దీనిని సికింద్రాబాద్‌-విజయవాడల మధ్య దీనిని నడపాలని ప్రతిపాదించగా, ఆ తర్వాత విశాఖట్నం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర రైళ్లు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం చేరుకోవడానికి కనీసం 12 గంటలైనా సమయం పడుతుంది.
 
విశాఖలో బోగీలపై రాళ్లతో దాడి
 
 కాగా, ఈ రైలు ట్రయిల్ రన్ గా బుధవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు వచ్చినప్పుడు  దీని బోగీలపై కొందరు దుండగులు రాళ్ళతో దాడి జరిపారు. చెన్నె నుంచి విశాఖపట్నం  వచ్చిన ఈ రైలును బుధవారం రాత్రి స్టేషన్‌ నుంచి కోచింగ్‌ కాంప్లెక్స్‌కు తీసుకువెళుతుండగా కంచరపాలెంలో కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు.
 
ఈ ఘటనలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై రైల్వే వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. పోలీసులకు రైల్వే పోలీసులు ఫిర్యాదు చేశారు. రైల్వే ఆస్తులంటే ప్రజలవేనని, వాటిని ధ్వంసం చేస్తే నష్టం వారికేనని, ఆ విషయం తెలుసుకోకుండా రైల్వే ఆస్తులు, ప్రాంగణాలను పాడు చేయడం తగదని అధికారులు పేర్కొన్నారు.
 
ఈ రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపొచ్చు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రైలు. బయటకు కనిపించే రూపం ఏరోడైనమిక్‌ డిజైన్‌.  మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌. రైలులో సీటింగ్‌ సామర్థ్యం 1,128. రైలుకు మధ్యలో వుండే రెండు కోచ్‌లు ఫస్ట్‌ క్లాస్‌కు చెందినవి. వాటి సీటింగ్‌ సామర్థ్యం కోచ్‌కు 52. మిగిలిన కోచ్‌లలో ఒక్కో దాంట్లో 78 మంది కూర్చోవచ్చు.

ఈ రైలులో సీట్లన్నీ రిక్లైనింగ్‌ మోడల్‌లో ఉంటాయి. అంటే ముందుకు, వెనక్కి ఫ్రీగా కదలొచ్చు. ఇందులో డోర్లన్నీ స్లైడింగ్‌ విధానంలో పనిచేస్తాయి. ప్రతి సీటుకు రీడింగ్‌ లైట్‌, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్‌ ఉంటాయి. ఏదైనా అవసరమైతే అటెండెంట్‌ను పిలవడానికి కాల్‌ బటన్‌ ఉంటుంది. ప్రతి కోచ్‌ను కవర్‌ చేస్తూ సీసీ టీవీ కెమెరాలు ఉంటాయి. ఈ రైలుకు జీపీఐఎస్‌ కూడా ఉంటుంది. అంటే రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇందులో అన్నీ బయో టాయ్‌లెట్స్‌. విశాలంగా ఉంటాయి.