బీహార్‌లో హింసాత్మకంగా మారిన రైతుల నిరసన

బీహార్‌లో రైతుల నిరసన హింసాత్మకంగా మారింది. ఇంటిలో నిద్రిస్తున్న రైతులపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు విరుచుకుపడి విచక్షణరహితంగా కొట్టారంటూ స్థానికులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఆగ్రహావేశాలకు గురైన నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పుపెట్టారు. రైతుల రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అనేక పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

చౌసా ప్రాంతంలో సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్‌జేవీఎస్) పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్ కోసం 12 ఏళ్ల కిందట ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ భూములకు పెరిగిన విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత 85 రోజులుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ గేటు బయట రైతులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.45 గంటలకు బనార్‌పూర్ గ్రామానికి పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకుని ఇళ్లల్లోకి చొరబడి నిద్రిస్తున్న కొందరు రైతులను లాఠీలతో కొట్టారు.

నిరసనలకు నేతృత్వం వహిస్తున్న నరేంద్ర తివారీతోపాటు నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. అడ్డుకోబోయిన మహిళలను కూడా కొట్టారు. ఈ విషయం తెలిసిన రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. బుధవారం ఉదయం పవర్ ప్లాంట్‌తోపాటు అక్కడ ఉన్న పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కర్రలు, రాడ్లు చేతపట్టి పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు.

పలు వాహనాలను తగుల బెట్టారు. ప్లాంట్ గేట్ ముందు టైర్లు కాల్చి రోడ్డును బ్లాక్ చేశారు. రైతులను నియంత్రించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే రైతుల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులను పెద్ద సంఖ్యంలో అక్కడ మోహరించారు.

రైతు నిరసనకారుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, సరైన పరిహారం ఇవ్వనందునే తాము నిరసనలు చేస్తున్నామని చెప్పాడు. అయితే గత రాత్రి పోలీసులు ఒక రైతు ఇంటిపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా కొట్టారని, నలుగురిని అరెస్టు చేశారని, ఎస్‌జేవీఎన్ కంపెనీ కారణంగానే పోలీసులు తమను వేధిస్తునట్టు తెలిపాడు.