జోషీమఠ్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అత్యవసర విచారణ విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. ఈ కేసును జనవరి 16వ తేదీ విచారించనున్నట్లు ఇవాళ కోర్టు చెప్పింది. ముఖ్యమైన ప్రతి అంశంపై సుప్రీంకు రావాల్సిన అవసరం లేదని, ఆ అంశాలపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థలు పనిచేస్తున్నాయని కోర్టు తెలిపింది.
సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. జోషీమఠ్ విషయంలో అత్యవసర విచారణ చేపట్టాలని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పిటిషన్ దాఖలు చేశారు. జోషీమఠ్ వాసులకు తొందరగా ఆర్థిక సాయం చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు.
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పట్టణంలో ఇండ్లు కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. ఇండ్లు, హోటళ్లు, పలు కట్టడాల్లో పగుళ్లు వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రమాదకర కట్టడాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఈకేసును ఈనెల 16న విచారించనున్నట్లు తెలిపింది.
ఇండ్ల కూల్చివేత ప్రారంభం
కాగా, జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇండ్ల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను నేలమట్టం చేస్తున్నారు.
పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 678 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. భూమి దిగబడటంతో జోషిమఠ్‌లో భవనాలు బీటలు వారుతున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్ వేశారు. చమోలిలో భద్రత,రెస్క్యూ ఆపరేషన్ల కోసం అదనంగా రూ. 11 కోట్లను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విడుదల చేశారు.
ఇప్పటికే 4000 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎముకలు కొరికే చలికాలంలో జోషిమఠ్ వాసులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి తాత్కాలిక ఆశ్రమాలకు వెళ్లారు. మరోవైపు పగుళ్లు ఏర్పడిన ఇండ్లలో నివసిస్తున్న వారు వాటిని వదిలేసి వేరే ఇండ్లలో అద్దెకు ఉండాలని, ఇందుకు గాను 6 నెలల పాటు నెలకు రూ.4,000 చొప్పున అద్దె చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి