హజ్‌ యాత్రకు కరోనా ఆంక్షల ఎత్తివేత

కరోనా సమయంలో హజ్ యాత్రపై విధించిన ఆంక్షలను సౌదీ అరేబియా తొలగించింది. అలాగే, హజ్ యాత్రకు వచ్చేవారి వయోపరిమితిని కూడా తొలగించారు. ఈ నిర్ణయంతో ఎంత మంది యాత్రికులైనా ఇప్పుడు హజ్‌ను దర్శించుకోవచ్చు. అలాగే, ఏ వయస్సు వారైనా హజ్ యాత్రకు వెళ్లగలుగుతారు.
 
జైరియన్ల సరిహద్దు నుంచి కూడా ఆంక్షలు ఎత్తివేశారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సౌదీ అరేబియా హజ్‌ యాత్రపై ఈ ఆంక్షలను విధించింది. సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా ఈ విషయాలను వెల్లడించారు. హజ్‌ యాత్ర జూన్‌ 26 నుంచి ప్రారంభమవనున్నది.  2023 లో హజ్ చేసే వారి సంఖ్య కరోనాకు ముందు మాదిరిగానే ఉండనున్నది.
 
అరబ్‌ న్యూస్‌ ప్రకారం, 2019 లో 25 లక్షల మంది హజ్ చేపట్టారు. 2020లో కరోనా కారణంగా ఈ సంఖ్య వెయ్యికి తగ్గిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా సౌదీ అరేబియా వాసులు 20-50 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే హజ్ చేశారు. కాగా, 2021లో కొన్ని పరిమితులతో 60 వేల మందిని హజ్ చేయడానికి అనుమతించారు. వీరంతా కూడా సౌదీ పౌరులే.
 
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న అంతర్జాతీయ యాత్రికులు హజ్‌ చేసేందుకు 2022 లో అనుమతించారు. గత ఏడాది మొత్తం 10 లక్షల మంది హజ్ యాత్రలో పాల్గొన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. హజ్‌ యాత్ర దరఖాస్తులను ఫిబ్రవరి 15 వరకు దాఖలు చేయవచ్చు. దీని కోసం ప్రయాణికులు జూలై మధ్య వరకు చెల్లుబాటయ్యే నివాస గుర్తింపు కార్డును కలిగి ఉండాలి.
 
దాంతో పాటు కరోనా, సీజనల్ ఇన్‌ఫ్లూయోంజా టీకా తీసుకున్నట్లు సర్టిఫికేట్ కలిగి ఉండాలి. హజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ ద్వారా కూడా డైరెక్ట్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులకు ఒకే మొబైల్ నంబర్‌ను వినియోగించకుండా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి ఉమ్రా వీసా వ్యవధిని 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచారు.
 
ఈ వీసాపై వచ్చే వారు సౌదీలోని ఏ నగరానికైనా ప్రయాణించవచ్చు. హజ్‌ ప్యాకేజీ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించే వెసలుబాటు కల్పించారు. సీటును రిజర్వ్‌ చేసుకునేందుకు 20 శాతం డిపాజిట్‌ చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 72 గంటల్లోగా డౌన్‌పేమెంట్‌ చేయాలి. మిగతా మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.