జర్మనీలో రసాయన దాడికి ఇరాన్ సోదరుల యత్నం 

జర్మనీలో భారీ ఉగ్రవాద దాడి తప్పింది. రసాయనాలతో దాడికి పాల్పడేందుకు సిద్ధపడిన ఇద్దరు వ్యక్తులను జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి అత్యంత ప్రమాదకరమైన 84 మిల్లీగ్రాముల రిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న ఇద్దరూ ఇరాన్ కు చెందిన సోదరులే. వీరు ఇస్లామిక్‌ మత ఛాందసవాదులుగా గుర్తింపుపొందారు. వీరిని జర్మనీలో ఎంజే, జేజే అని పిలుస్తుంటారు. వీరిద్దరూ ఐఎస్‌ మద్దతుదారులుగా అధికారులు గుర్తించారు. వీరి కుట్రను అమెరికా ఎఫ్‌బీఐ పసిగట్టి జర్మనీకి సమాచారం చేరవేయడంతో కుట్ర బట్టబయలైంది.

ప్రమాదకరమైన జీవ ఆయుధాలతో దాడి చేయబోతున్నారని అందిన పక్కా సమాచారం మేరకు జర్మనీ పోలీసులు ఆపరేషన్‌ చేపట్టారు. నార్త్‌ రైన్‌-వెస్ట్‌ఫాలియా ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని ఇద్దరు ఇరాన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో జర్మనీలో బారీ ఉగ్రవాద దాడి తప్పినట్లయిందని అధికారులు భావిస్తున్నారు. నిందితుల నుంచి సైనైడ్‌, రిసిన్‌ వంటి రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి వీరిద్దరూ చాలా మందిని చంపాలనుకున్నారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

వీరిని అరెస్ట్‌ చేసిన తర్వాత రసాయనాల ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజానికి రిసిన్‌ అనేది ఎండు ద్రాక్ష గింజల నుంచి తయారవుతుంది. ఇది ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన నిమిషాల్లోనే చంపేయగలదు. ఇది సైనైడ్‌ కంటే 6000 రెట్లు ప్రమాదకరమని అధికారులు చెప్పారు.

ఉగ్రవాద దాడికి సంబంధించిన సమాచారాన్ని చాటింగ్‌ ద్వారా చేరవేసుకుంటుండగా అమెరికా ఎఫ్‌బీఐ పసిగట్టింది. ఇద్దరు వ్యక్తులు రసాయనాలతో బాంబుల తయారీ గురించి టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుకున్న విషయాన్ని సేకరించింది. అనంతరం సమాచారాన్ని జర్మనీ భద్రతా దళాలకు అందించింది.

విషపూరిత బాంబులను తయారు చేయడానికి ఇంటర్నెట్ నుంచి వీరు అనేక రకాల ప్రాణాంతక రసాయనాలను ఆర్డర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా, భారీ ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన వీరికి 3-15 సంవత్సరాల జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నదని జర్మనీ హోం మంత్రి నాన్సీ ఫాజర్ తెలిపారు