జోషిమ‌ఠ్ త‌ర‌హాలో ముప్పు ముంగిట ఉత్త‌ర‌కాశీ, నైనిటాల్!

ఉత్తరాఖండ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్‌లో భూమి కుంగిపోవ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో భూమి కోత‌కు గురికావ‌డం, ప‌గుళ్లతో భ‌యాన‌క ప‌రిస్ధితి నెల‌కొంది. 600కు పైగా ఇండ్ల‌కు ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. ఇక జోషిమ‌ఠ్ ప‌ట్ట‌ణ‌మే కాకుండా ఉత్త‌ర‌కాశీ, నైనిటాల్‌కూ ప్ర‌మాదం పొంచిఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

హిమాల‌యాల చెంత‌నున్న ప‌లు ప‌ట్ణణాలు, న‌గ‌రాల్లో భూమి కుంగుబాటుకు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. స్ధానిక భౌగోళిక ప‌రిస్ధితుల‌ను విస్మ‌రిస్తూ కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టిన ఫలితంగానే ప‌ర్యావ‌ర‌ణ అన‌నుకూల ప‌రిస్ధితుల‌కు దారితీస్తోంద‌ని వారు స్ప‌ష్టం చేశారు. బ‌ల‌హీన పునాదుల‌తో పాటు, ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల భూమి కోత‌కు గుర‌వ‌డం కూడా జోషిమ‌ఠ్‌లో ఈ ప‌రిస్ధితి నెల‌కొంద‌ని వారు వివ‌రించారు. మాన‌వ ప్రేరిత కార్య‌క‌లాపాలు దీనికి మ‌రింత ఆజ్యం పోశాయ‌ని చెబుతున్నారు.

ఎంసీటీ-2 జోన్ రీయాక్టివేట్ కావ‌డంతో ఒక్క‌సారిగా జోషిమ‌ఠ్‌లో భూమి కుంగిపోయింద‌ని, ఈ రీయాక్టివేష‌న్ ఎప్పుడు జ‌రుగుతుంద‌ని ఏ భూగ‌ర్భ శాస్త్ర‌వేత్త అంచ‌నా వేయ‌లేర‌ని కుమౌన్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ బ‌హ‌దూర్ సింగ్ కోట్లియా చెప్పారు. జోషిమ‌ఠ్ ఒక్క‌టే ఇలాంటి ప‌రిస్ధితికి గురికాబోద‌ని, ఉత్త‌ర కాశీ, నైనిటాల్‌కూ ఈ ముప్పు ఉంద‌ని హెచ్చ‌రించారు. తాము రెండు ద‌శాబ్ధాల నుంచి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కూ నిర్ల‌క్ష్యం చేశార‌ని మండిప‌డ్డారు. ప్ర‌కృతితో మీరు పోరాడి గెల‌వ‌లేర‌ని డాక్ట‌ర్ సింగ్ పేర్కొన్నారు.

కుంగిపోయే ప్రాంతంగా గుర్తింపు 

జోషీమఠ్‌ కుంగిపోయే, కొండ చరియలు విరిగిపడే ప్రాంతంగా అధికారులు గుర్తించారు. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 610 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

ఇప్పటివరకు 60 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 90 కుటుంబాలను అత్యవసరంగా తరలించాల్సి ఉన్నది. వీరి కోసం స్థానికంగా ఉన్న హోటళ్లు, గురుద్వారా, రెండు కాలేజీల్లో క్యాంపులు ఏర్పాటు చేశారు. పగుళ్లు ఏర్పడిన ఇండ్లలో నివసిస్తున్న వారు వాటిని వదిలేసి వేరే ఇండ్లలో అద్దెకు ఉండాలని, ఇందుకు గాను 6 నెలల పాటు నెలకు రూ.4,000 చొప్పున అద్దె చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.

జోషీమఠ్‌లో పరిస్థితిని అధ్యయనం చేయాల్సిందిగా హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ), డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌)లను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కోరింది. శాటిలైట్‌ చిత్రాల ద్వారా అధ్యయనం జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది.

ఇప్పటికే ఐఐటీ రూర్కీ, వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ, సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థలు కూడా జోషీమఠ్‌ భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేశాయి. త్వరలోనే ఈ సంస్థలు నివేదిక ఇవ్వనున్నాయి.

నైసర్గికంగా సున్నితమైన కీలక స్థానం 

ఈ ప్రాంతం నైసర్గికంగా అత్యంత కీలకమైన సున్నితమైన ప్రకంపనలు కేంద్రీకృత స్థలంలో ఉంది. హిమాలయ పర్వత శ్రేణువులు, మరోవైపు పలు ప్రవాహాలు నదులు తరచూ ఈ ప్రాంతంలోని భూగర్భ పరిస్థితిని దెబ్బతీస్తూ ఉంటాయి.

అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణపు పనులు జరగడం, హైడ్రోపవర్ ప్రాజెక్టులు జోరుగా నిర్మాణంలో ఉండటంతో అంతర్గతంగా భూమిపొరలలో తలెత్తిన ఒత్తిడి పరిణామాలు ఇప్పటి పరిస్థితికి దారితీస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఇది క్రమేపీ నేల మట్టం అవుతుందని కూడా విశ్లేషకులు హెచ్చరించారు.

దాదాపు 17,000 మందికి పైగా ఉండే ఈ పట్టణం హిందూ , సిక్కు పుణ్యక్షేత్రాలకు ముఖద్వారం. ఇక్కడి నుంచే బద్రీనాథ్, హేమ్‌కుంద్ సాహిబ్ వంటి ప్రాంతాలకు జనం వెళ్లుతుంటారు. పర్వతారోహకులు ఈ ప్రాంతం నుంచే సాహస విన్యాసాలకు ఔలిలోని కేంద్రానికి చేరుకుంటారు. ఈ విధంగా పలువురికి ఈ ప్రాంతం విడిదిగా ఉంది.

భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం అయిన జోషిమఠ్ ధౌలిగంగా, అలకానంద నదుల సంగమ స్థలి అయిన విష్ణు ప్రయాగకు చేరువలో ఉంది.   బద్రీనాథ్‌కు వెళ్లే చాలా మంది రాత్రి ఇక్కడనే బస చేసి ఉదయం వెళ్లుతుంటారు. సైనికులకు, పర్వతారోహకులకు ఇది బేస్ క్యాంప్‌గా ఉంది. మరో ప్రత్యేకత ఏమిటంటే బద్రీనాథ్ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తర్వాత బద్రీనాథుడి విగ్రహాన్ని ఇక్కడికే తీసుకొచ్చి దైనందిన పూజాదికాలు నిర్వహిస్తారు.