సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై క్రమంగా పెరుగుతున్న వడ్డీ

సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 8 శాతం, అంతకన్నా ఎక్కువ వడ్డీ రేటును ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఈ స్థాయిలో బ్యాంకులు వడ్డీ రేట్లు ప్రకటించడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా బ్యాంకులు తాము అందించే రుణాలపైనే కాకుండా డిపాజిట్లపైనా కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీని మూలంగా సీనియర్‌ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ రేటు లభించే పరిస్థితి ఏర్పడింది.

పని చేసే శక్తిలేని, రిస్క్‌ తీసుకునేంత ధైర్యం లేని చాలా మంది సీనియర్‌ సిటిజన్లు బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రాబడిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఆశలను దెబ్బతీసింది. వారికి వచ్చే వడ్డీ రాబడిలో కోత పడేలా చేసింది.

కరోనా కాలంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు లభ్యత పెరిగింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు 5.5 శాతానికి దిగజారిపోయాయి. దీని వల్ల సీనియర్‌ సిటిజన్లకు వచ్చే రాబడి తగ్గిపోయింది. అయితే ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం మొదలైంది. కొన్ని ప్రైవేటు బ్యాంకులు వయోవృద్ధుల డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటును ఇస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు 7.5 శాతానికి పైగా వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన సీనియర్‌ సిటిజన్లు తమ పాత డిపాజిట్లను కాలపరిమితికన్నా ముందుగానే ఉపసంహరించుకుంటున్నారు. అధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకుల్లో లేదా అదే బ్యాంకులో ఎక్కువ వడ్డీ రేటుకు కొత్తగా డిపాజిట్‌ చేస్తున్నారు.  మహమ్మారి కాలంలో పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో అందించే సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎ్‌సఎ్‌స)పై వడ్డీ రేటు 7.4 శాతానికి తగ్గిపోయింది. అయితే ప్రభుత్వం ఈ వడ్డీ రేటును తాజాగా 8 శాతానికి పెంచేసింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) 2-3 ఏళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు 2020 మే నుంచి 2022 జనవరి వరకు 5.6 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేసింది. ఇప్పుడు వడ్డీ రేటును 7.25 శాతానికి పెంచింది. ప్రైవేటు రంగంలోని యాక్సిస్‌ బ్యాంకు ఇదే కాలపరిమితికి 2021 మార్చిలో 5.9 శాతం వడ్డీ రేటును ఇవ్వగా ఇప్పుడు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీలు కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. హెచ్‌డీఎ్‌ఫసీ ‘సఫైర్‌’ డిపాజిట్‌ స్కీమ్‌ 7.6 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఇందులో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టినా లేదా ఇన్వెస్టర్లు వాటాదారులైనా ఎక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. వాటాదారులైన సీనియర్‌ సిటిజన్లు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా డిపాజిట్‌ చేస్తే 8 శాతంకన్నా కాస్త తక్కువ వడ్డీ రేటును ఇస్తోంది.

సాధారణ డిపాజిటర్లకు ఇచ్చే దానితో పోల్చితే సీనియర్‌ సిటిజన్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటును ఇస్తుంటాయన్న విషయం తెలిసిందే. 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వారిని సీనియర్‌ సిటిజన్లుగా పరిగణిస్తారు. 80 ఏళు, అంతకన్నా ఎక్కువ వయసున్నవారిని సూపర్‌ సీనియర్‌ సిటిజన్లు అంటారు.

ఇక యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) సూపర్‌ సీనియర్లకు రెగ్యులర్‌ రేటుకన్నా 0.75 శాతం అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. 700 రోజుల డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇస్తోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రెగ్యులర్‌ రేటుకన్నా 0.80 శాతం ఎక్కువ వడ్డీని ఇస్తోంది.

వివిధ బ్యాంకుల్లో గరిష్ఠ వడ్డీ రేట్లు: డీసీబీ 8.35, పీఎన్‌బీ 8.05, ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ 8, యెస్‌ బ్యాంక్‌ 8, ఇండ్‌సఇండ్‌ 7.85, సెంట్రల్‌ బ్యాంక్‌ 7.85, సెంట్రల్‌ బ్యాంక్‌ 7.85, హెచ్‌డీఎ్‌ఫసీ 7.75, యాక్సిస్‌ 7.75, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 7.55, ఎస్‌బీఐ 7.25.