ఏపీలోనే ఎస్సీ కార్పొరేషన్ నిధుల మల్లింపు 

దేశంలో ఏ రాష్ట్రం లో లేని రీతిలో ఎస్. సి కార్పొరేషన్ పథకాలకు సంబంధించిన నిధుల మల్లింపు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నదని ఉమ్మడి రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆర్. డి. విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.  ఉమ్మడి రాష్ట్రం లో ఎస్. సి కార్పొరేషన్ కి చైర్మన్ గా చేసిన వ్యక్తి గా కార్పొరేషన్ ని నిర్వీర్యం చేస్తుంటే గత మూడు న్నర ఏళ్లుగా తాను గళం విప్పుతూనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు.
కేంద్రం నుండి మోదీ ప్రభుత్వం ద్వారా వస్తున్న ఎన్ఎస్ఎఫ్ డి, ఎన్ఎస్ కెఎఫ్ డిసి నిధులను ఎస్. సి కార్పొరేషన్ కు కేటాయించక పోగా దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి దారుణాలను చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తుంటే రాబోయే తరాలు మనలను క్షమింపవని ఆయన హెచ్చరించారు.
ఈ విషయమై తాజాగా రాష్ట్ర హైకోర్ట్ కూడా తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. నిధులు కేటాయించనప్పుడు ఇక కార్పొరేషన్ ఎందుకు మూసేయ్ మని చెప్పిందని తెలిపారు. బిజెపి ఎప్పుడు పిలుపిస్తే అప్పుడు ఆందోళనలు జరిపే విధంగా  అన్ని జిల్లాల్లో
 స్పష్ట మైన కార్యాచరణకు మనం సిద్ధం కావాలని అంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. 
 
పార్టీ నాయకత్వం ఎప్పుడు పిలుపు ఇచ్చినా తాను ముందు వరసలో ఉంటూ పోరాటాలకు సిద్ధంగా ఉంటానని విల్సన్ స్పష్టం చేశారు. భూమి కొనుగోలు పథకం, ఆటోలు, ఇన్నోవా, ట్రాక్టర్స్, పండ్ల తోటల పెంపకం, మోటార్ల పంపిణీ, బోరుబావులు ఏర్పాటు, నేరుగా రుణాలు,కంప్యూటర్, నర్సింగ్, డ్రైవింగ్ వంటి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మన పిల్లలకు కార్పొరేషన్ ద్వారా వచ్చేవని ఆయన చెప్పారు.
తన హయాంలో ఇటువంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు కేటాయించామని చెబుతూ ఇప్పుడు ఏర్పడిన చైర్మన్ లు ఆ విధంగా ఇవ్వలేక పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అంటే అది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలను ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు.