విశాఖలో మార్చ్ 28, 29లలో జీ -20 సన్నాహక సదస్సు

విశాఖపట్నం నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. 

రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయబారులతో పాటుగా కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. వారికి కావాల్సిన వసతి, సదస్సు నిర్వహణ ఏర్పాట్ల పైన అధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది.

జీ -20 అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత నిర్వహణ పైన ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో  తాము జీ-20 సన్నాహక సదస్సు విశాఖ కేంద్రంగా నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. దానితో కేంద్రం విశాఖ కేంద్రంగా ఈ సదస్సు జరపడానికి  నిర్ణయించింది. మార్చి 28, 29 తేదీల్లో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

దేశవ్యాప్తంగా 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అందులో ఏపీ నుంచి విశాఖకు అవకాశం దక్కింది. అతిధుల కోసం స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సు కు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహిస్తున్నారు. 

సదస్సులె సీఎం జగన్ తో సహా కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్ ఇండియా..హరిత అభివృద్ధితో పాటుగా మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు.

వివిధ దేశాల నుంచి జీ -20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణకు నిర్ణయించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులను రాష్ట్రం ఆహ్వానించింది.

కీలకమైన 12 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మార్చి తొలి వారంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. చివరి వారంలో జీ 20 సన్నాహక సదస్సుతో విశాఖ నగరం అంతర్జాతీయ – జాతీయ ప్రముఖలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.