విజయవాడ నుండి 4 గంటల్లోనే విశాఖపట్నం!

ప్రస్తుతం ఆరు గంటలకు పైగా పడుతున్న విజయవాడ నుండి విశాఖపట్నంకు రైలు ప్రయాణం సమయాన్ని 4 గంటలకు కుదించే ప్రయత్నంలో రైల్వే అధికారులు విజయం సాధించారు. దానితో ఈ మార్గంలో ఏపీలో తొలి వందేభారత్ రైలును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
రైల్వే లైన్ ల సామర్ధ్యాన్ని పెంపొందించడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించు గలుగుతున్నారు. ఈ మేరకు నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతం కావడంతో తొందరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  ప్రస్తుతం విజయవాడ-దువ్వాడ చేరేందుకు సుమారు 5.25 గంటల నుంచి 6-6.30 గంటలు వరకు పడుతోంది. మరికొన్ని రైళ్లకు అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది.
విజయవాడ-దువ్వాడ మధ్య రైలు మార్గంలో ట్రాక్‌ సామర్థ్యం 130 కి.మీ.కు పెంచడంతో ప్రయాణ దూరం తగ్గింప గలుగుతున్నారు.  తాజాగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో విజయవాడ నుంచి 7.50కి బయల్దేరిన రైలు 11.50కి దువ్వాడ చేరింది. అంటే 330 కి.మీ. దూరంలోని గమ్యస్థానాన్ని నాలుగు గంటల్లోనే చేరింది.
ఈ ట్రయల్ రన్ తర్వాత దాదాపు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ ప్రయాణం మధ్యలో రాజమండ్రిలో రైలు 10 నిమిషాలు ఆగింది.  మూడో ప్లాట్‌ఫాం పనులతో యలమంచిలి స్టేషన్‌ దగ్గర వేగాన్ని బాగా తగ్గించారు. ఈ పనులు కూడా పూర్తి చేస్తే ఇంకా ముందే వెళ్లొచ్చు.
ఐసీఎఫ్‌ కోచ్‌ల గరిష్ఠ సామర్థ్యం గంటకు 110 కి.మీ కాగా, ఎల్‌హెచ్‌బీవి 130 కి.మీటర్లు. ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడిచే గోదావరి, గౌతమి, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, కోణార్క్‌ వంటి రైళ్ల వేగం 130 కి.మీ.పెరిగేందుకు అవకాశం ఉంది అంటున్నారు.
ఒకవేళ ఈ రైళ్లకు వేగం పెంచాలంటే టైం టేబుల్‌లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబరులో ప్రకటించిన టైంటేబుల్‌ ప్రస్తుతం అమల్లో ఉండగా, మళ్లీ అక్టోబరు వరకు ఆగకుండా జీరోబేస్డ్‌ టైంటేబుల్‌లో ఈ రైళ్లను చేరిస్తే వేగం పెరుగుతుంది అంటున్నారు.

అంతేకాదు ఏపీకి కూడా ఒక వందేభారత్ రైలును కేటాయించారు. అందుకే ఈ ట్రయిల్‌ రన్‌ విజయవంతంతో వందేభారత్‌ రైళ్లు త్వరగా రావడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ ట్రయల్ రన్‌తో సికింద్రాబాద్‌-విజయవాడ-దువ్వాడ వరకు గరిష్ఠంగా 130 కి.మీ. వేగంతో రైళ్లు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పాలి.