ముంపు భయంతో ఇండోనేషియా రాజధాని మార్పు 

రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్‌లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే ప్రారంభించనుంది. జకర్తాలో విపరీతంగా పెరిగిపోయిన జనాభా, ఈ నగరానికి భౌగోళికంగా పొంచి ఉన్న ముప్పు కారణంగానే రాజధానిని మార్చాలని ఇండోనేషియా నిర్ణయించింది.

జకర్తాలో విపరీతం భూగర్భ జలాలను తోడుతుండటం వల్ల ప్రమాదకర రీతిలో సగటున ఏడాదికి ఆరు సెంటీమీటర్లు మునిగిపోతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి పావువంతు జకర్తా నగరం నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భూకంపాల ముప్పు కూడా ఈ నగరానికి ఎక్కువ. మరోవైపు ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో జకర్తా ఒకటి. ఇక్కడ మూడు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్‌, కాలుష్యంతో ఈ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. రాజధాని మార్పు గురించి గత ఏడాది జనవరిలోనే ఆ దేశ పార్లమెంట్ ఓ బిల్లును ఆమోదించింది.

ఈ నేపథ్యంలో రాజధానిని నుసంతరకు మార్చాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది భౌగోళికంగా సురక్షితమైన ప్రాంతంగా గుర్తించింది. నుసంతర ప్రపంచంలోనే అతి పురాతనమైన రెయిన్‌ఫారెస్ట్‌కు నెలవు. జనాభా కూడా 40 లక్షలు మాత్రమే ఉంది. దీంతో నుసంతరకు రాజధానిని మార్చేందుకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 56,180 హెక్టార్లను గుర్తించింది. రాజధాని మార్పు ప్రతిపాదనను మొదటగా 2019లో ఆ దేశ అధ్యక్షుడు జాకీ విడొడొ ప్రతిపాదించారు.