2022లో 1.25 లక్షల విద్యార్థి వీసాలు జారీ  చేసిన అమెరికా 

2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1,25,000 విద్యార్థి వీసాలు జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యకు భారత్‌ నుండి డిమాండ్‌ పెరిగింది. దీంతో సుమారు లక్షకు పైగా వీసాల జారీతో భారతదేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం, దౌత్యవేత్తలు రికార్డు బద్దలు కొట్టారని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు.
భారతీయుల వీసా సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ సమయాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.  గత కొన్నేళ్లతో   పోలిస్తే 2022లో భారత విద్యార్థులకు అత్యధికంగా వీసాలు జారీ చేసినట్లు తెలిపారు.
వలసేతర ప్రయాణికులకు చట్టబద్ధమైన ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు జాతీయ భద్రతను పరిరక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు, పరిపాలనా లక్ష్యాలు నెరవేరడానికి సకాలంలో వీసా ప్రాసెసింగ్‌ ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా దేశాల్లో కరోనా ఆంక్షలను సరళీకరించారని, దీంతో అమెరికా వీసాలకు డిమాండ్‌ పెరిగిందని చెప్పారు. అయితే, సిబ్బంది కొరత, ఇతర సవాళ్ల కారణంగా కొంతకాలంగా వీసాల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
వీసాల జారీ కోసం కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నామని, దీంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకుందని, ఏడాదిలోగా కరోనా ముందు నాటి స్థితికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌ విద్యార్థుల వాటా 20 శాతం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

భారీగా పెరగనున్న ఇమ్మిగ్రేషన్ ఫీజులు  

కాగా, ఇమ్మిగ్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. దీంతో హెచ్ 1బి సహా పలు రకాల వీసా దరఖాస్తు ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఈ ప్రతిపాదనలను త్వరలోనే అమలులోకి తెచ్చే అవకాశం ఉంది.

ఇమ్మిగ్రేషన్ ఫీజుల పెంపు ప్రతిపాదనలను అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) విభాగం తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దాని ప్రకారం హెచ్1బి వీసా దరఖాస్తు ధరను 460 డాలర్లనుంచి 780 డాలర్లకు పెంచింది. ఎల్1 వీసా ధరను 460 డాలర్లనుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచింది.

అలాగే ఒ1వీసా ధరను 460 డాలర్లనుంచి 1,055 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇక హెచ్2 బి వీసా ధరనుకూడా 460 డాలర్లనుంచి 1,080 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను 60 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తారు.