పురుషుల ఇంద్రియ నాణ్యతపై కరోనా ప్రభావం

తీవ్రస్థాయి కరోనా మనిషి ప్రాణాలు తీయడమే కాకుండా మగవారిలో వీర్యంపై ప్రతికూల ప్ర భావం చూపుతోందని పాట్నాలోని ఎయిమ్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా రెండు మూడేళ్ల నుంచి సార్స్ కోవ్ 2 వైరస్ మానవాళిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తూ వస్తోంది.
దీర్ఘకాలం వైరస్ ప్రభావానికి గురైన మగవారిలో క్రమేపీ పురుషత్వపు సంకేతాలైన వీర్య కణాలు తగ్గిపోవడం లేదా దెబ్బతినడం జరుగుతోందని పరిశోధకులు నిర్థారించారు.  సార్స్‌-సిఓవి-2 వైరస్ సంక్రమణ పురుషుల ఇంద్రియంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ  అధ్యయనంలో వెల్లడైంది.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధకులు 30 మంది పురుషులపై చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయింది. ఈ పరిశోధనను పాట్నాకు చెందిన ఎయిమ్స్ పరిశోధకుల బృందం చేపట్టింది.  కరోనా మల్టీఆర్గన్ డ్యామేజికి దాదితీస్తుందని వారు కనుగొన్నారు.
అదికూడా వృషణ కణజాలంలో సమృద్ధిగా ఉండే యాంజియోటెన్సిన్‌కన్వర్టింగ్ ఎంజైమ్2 రిసెప్టర్ (ఏసిఈ2)ద్వారా అని కనుగొన్నారు. ఏసిఈ2 సార్స్ సిఓవి2 స్పైక్ ప్రోటీన్‌కి గ్రాహకంగా పనిచేస్తుంది. దీని ద్వారా వైరస్ హోస్ట్ కణాలలోకి ప్రవేశిస్తుంది. అయితే వీర్యంలో సార్స్‌సిఓవి2 షెడ్డింగ్ గురించి తక్కువ సమాచారమే అందుబాటులో ఉంది.
మగవారిలో వీర్య ఉత్పత్తికి సంబంధించి అత్యంత కీలకమైన వృషణ కణజాలంపై వైరస్ కణాల దాడి జరుగుతోంది. వైరస్ మనిషిలో బహుళ అవయవాల నష్టానికి దారితీస్తోంది. వృషణకణజాలంలో సమృద్ధిగా ఉండే ఎసిఇ2 ఎంజైమ్ ద్వారా కణజాలంలోకి ప్రవేశిస్తోంది.
ఈ క్రమంలో వీర్య ఉత్పత్తి, వీర్య సామర్థం దెబ్బతినడమే కాకుండా ఆ తర్వాత వైరస్ మరింత బలంగా మనిషి కణజాలాలోకి చేరుకునేందుకు రంగం సిద్ధం అవుతుంది. అయితే వైరస్ బారి నుంచి వ్యక్తి బయటపడ్డా, ఆ తరువాతి క్రమంలో మగవారిలో వీర్య కణాలు తగ్గుముఖం పడుతున్నాయని గుర్తించారు.
ఎయిమ్స్ పరిశోధకులు వీర్యం నాణ్యత, వీర్యం డిఎన్‌ఏ ఫ్రాగ్మెంటేషన్ సూచీపై వ్యాధి ప్రభావాన్ని విశ్లేషించారు, ఇది డిఎన్‌ఏ సమగ్రతను, నష్టాన్ని ప్రతిబింబిస్తుంది. తద్వారా సంభావ్య స్మెర్మ్ నష్టాన్ని గుర్తించింది. పాట్నా ఎయిమ్స్‌లో 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న ముప్పై మంది కరోనా రోగులపై ఈ పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనం 2020 నుంచి 2021 వరకు నిర్వహించారు.
వారి వీర్యానికి వివిధ పరీక్షలు చేశారు. తర్వాత 74 రోజులకు మళ్లీ వారి శాంపిళ్లను తీసుకొని అవే పరీక్షలు చేశారు. మొదటిసారి పరీక్షించినప్పుడు స్పెర్మ్‌ కౌంట్‌, మొటిలిటీ వంటివి తక్కువగా ఉన్నాయని, రెండో పరీక్ష నాటికి పెరిగినా ఉండాల్సినంత లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. వీర్యంలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు లేకపోయినా వీర్య నాణ్యత తక్కువగానే ఉందని చెప్పారు.