చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు … బీజేపీ అభ్యంతరం

ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న క్రమంలో పోలీసులు ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు.
 
*స్థానిక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడును  ఆంక్షలు పేరుతో అడ్డుకోవడం ఏ విధంగానూ సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల హర్షించే విధంగా వారు వ్యవరించాలని, అలా కాకుండా దురుద్దేశంతో వ్యవహరించటం మంచిది కాదని హితవు చెప్పారు.
 
2018లో అప్పటి బిజెపి అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర హోం మంత్రి  అమిత్ షా కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన సందర్భంగా పోలీసుల్ని టిడిపి కార్యకర్తలని పెట్టి  అమీత్ షా కారుపై రాళ్లు కర్రలతో దాడి చేశారని గుర్తు చేశారు. అదే విధంగా,  2019 ఎన్నికల సందర్భంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఆంధ్రప్రదేశ్ కు రాకుండా, సభలు సక్రమంగా జరగకుండా అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి, నిరసన కార్యక్రమాలు, నల్ల బెలూన్లు జెండాలు హోర్డింగులని చంద్రబాబు ప్రభుత్వం పెట్టినదని పేర్కొన్నారు.
 
నేటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పంథాలో వ్యవహరించడం మంచిది కాదని  సోము వీర్రాజు హితవు పలికారు.నాటి టిడిపి – నేటి వైసిపి రెండు కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలేనని, ఈ రెండు పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వరని రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ఇలాంటి అంశాలపై ఈ రెండు పార్టీల పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని సోము వీర్రాజు హెచ్చరించారు.