ఆధ్యాత్మిక దివ్య శిఖరం పరమహంస యోగానంద

* జన్మదిన సంస్మరణ
 
ఏవి నారాయణరావు
 
ఆధ్యాత్మిక దివ్యతరంగానికి శిఖరమూ, భారతీయ ప్రాచీన యోగ విజ్ఞానం పట్ల ప్రపంచ వాసుల ఆసక్తిని పునర్జీవింపచేసిన దూత, “ఒక యోగి ఆత్మ కథ.” “పశ్చిమ దేశాల్లో యోగ విద్యా పితామహుడు” గా గుర్తింపు పొందిన పరమహంస యోగానంద ముకుందలాల్ ఘోష్ గా జనవరి 5న గోరఖ్ పూర్ లో జన్మించారు. ఈ ఏడాది పరమహంస యోగానంద 130వ జయంతి ఉత్సవాలు దేశ విదేశాల్లో ఘనంగా జరగబోతున్నాయి. హైదరాబాద్‌ బేగంపేట చికోటీ గార్డెన్స్‌లో ఉన్న యోగదా సత్సంగ్ సెంటర్‌లోనూ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.   
 
యోగానంద తల్లిదండ్రులు భగవతిచరణ్ ఘోష్ (బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉన్నతోద్యోగి), జ్ఞానప్రభ ఘోష్… ఆ ఉత్కృష్ట శిశువును యోగావతారులైన లాహిరీ మహాశయుల వద్దకు తీసుకువెళ్ళినపుడు ఆయన ఆ శిశువును తన ఒడిలో కూర్చో పెట్టుకొని, ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న రీతిలో తన చేతుల్ని ఆయన చిన్ని నుదుటిపై పెట్టి ఆయన తండ్రిగారి వృత్తితో చిత్రమైన రీతిలో పోలిక ఉండేలా “చిట్టితల్లీ, నీ కొడుకు యోగి అవుతాడమ్మా! ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిద్ధ్యానికి చేరుస్తాడు.” అని ఒక పవిత్రమైన భవిష్యవాణి వినిపించారు. యోగానంద చేసిన పై వాగ్దానం ఈ దీవెనలో మనకు ముందుగానే దర్శనమివ్వడం మనం చూడవచ్చు.  
 
తన సర్వోత్కృష్ట హృదయ వాంఛ అయిన ఈశ్వర దర్శనాన్ని ప్రసాదించే గురువుకోసమైన తన దివ్యాన్వేషణలో బాల ముకుందుడు ఎందరో మహానుభావులను కలిశాడు. కాగా శిష్యుడు ఎంతో తపనతో గురువు కోసం అన్వేషిస్తుండగా, గురువు కూడా తన వద్దకు పంపుతానని అమర గురువులైన మహావతార్ బాబాజీ సంవత్సరాల క్రితం ఒక కుంభమేళాలో తనకు వాగ్దానం చేసిన ఆ శిష్యుడి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 
 
చివరకు ముకుందుడు శ్రీయుక్తేశ్వరగిరి అయస్కాంత పరిధిలోకి ఆకర్షితులయిన పవిత్ర సందర్భంలో, సాధారణంగా స్థితప్రజ్ఞులు, జ్ఞానావతారులైన యుక్తేశ్వరగిరి బెంగాలీలో మళ్ళీ మళ్ళీ “నా తండ్రీ! వచ్చేశావా!” “ఎన్నేళ్ళు కాచుకుని ఉన్నాను బాబూ నీకోసం!” అంటూ అవధులు లేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
 
 ఆ తర్వాత గురువు దగ్గర పదేళ్ళ కఠినమైన శిక్షణ కొనసాగింది. అనంతరం ముకుందుడు ఎంతగానో ఎదురుచూస్తూ కఠిన శ్రమతో ఆర్జించుకొన్న సన్యాస దీక్షను గురువు ఆయనకు ప్రసాదించారు. అప్పటి నుండి ఆయన్ను యోగానంద అని పిలవడం ప్రారంభించారు. యోగానంద అంటే దివ్య ఐక్యత (యోగం) తో లభించే ఆనందం అని దాని అర్థం. 
 
 బాలల సర్వతోముఖాభివృద్ధి అనే ఆదర్శం తన హృదయాభిలాష కావడంతో యోగానంద దిహికలో 1917 లో ఏడుగురు బాలురతో ఒక బాలుర పాఠశాలను ప్రారంభించారు. ఒక ఏడాది తర్వాత రాంచీ లోని కాశింబజార్ రాజభవనం విద్యారంగంలోని ఈ పవిత్రాదర్శానికి వేదికైంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా  ప్రారంభం ఇలా జరిగింది.
 
 “మానవజాతిని విస్తృతమయిన తన ఆత్మగా గ్రహించి సేవ చేయడం” దీని కీలకాదర్శం. వందేళ్ళకు పైగా గడిచిన ఈ కాలంలో ఈ సంస్థ కాలం కలిగించే ఒడిదుడుకులకు చెక్కుచెదరకుండా, దాదాపు దేశమంతటా తన ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలతో దృఢంగా నిలచి ఉంది.  1920 లో యోగానంద అమెరికాలోని ప్రపంచ మత ఉదారవాదుల మహాసభకు భారతదేశం తరఫున రాయబారిగా ఆహ్వానితులయ్యారు. అనంతరం లాస్ ఏంజలీస్ ప్రధాన కేంద్రంగా ఆయన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించారు.  
 
 ఆయన బోధల మూల సారం శక్తివంతమైన ధ్యాన ప్రక్రియల విధానం — క్రియాయోగ  ధ్యాన విజ్ఞానం. భగవద్గీతలో ప్రస్తావించిన ప్రాచీన ఆత్మ విజ్ఞానం స్వయంకృషి తోనూ, దైవకృప తోనూ ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపే సాధనా పద్ధతుల్ని అందిస్తుంది. శ్రద్ధతో కూడిన దాని ఆచరణ యోగానంద నిజమైన జీవితాదర్శాన్నే ప్రతిఫలిస్తుంది; “జీవన సమరరంగంలో ప్రతి వ్యక్తినీ, ప్రతి పరిస్థితినీ ఒక యోధుని వలె ధైర్యంగానూ, ఒక విజేతను పోలిన చిరునవ్వుతోనూ ఎదుర్కో.” మరింత సమాచారం కోసం: yssofindia.org