హైదరాబాద్ లో మెట్రో సేవలకు అంతరాయం

హైదరాబాద్ లో మెట్రో రైల్ సేవలకు అంతరాయం కలిగింది. ఐదేళ్లుగా తమ జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. దీంతో హెచ్‌ఎంఆర్ఎల్ సిబ్బందిని హెచ్చరించింది. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేసింది.

స్వార్థ ప్రయోజనాల కోసం ధర్నా చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే యాజమాన్యం హెచ్చరికలపై ఉద్యోగులు కూడా అదే తరహాలో తిప్పి కొట్టారు. “మా సమస్యల ప్రస్తావిస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారా?” అంటు సిబ్బంది ప్రశ్నించారు.

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో నేడు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ లైన్ – మీయాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో స్టేషన్‌లలో టికెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధుల బహిష్కరణ చేశారు. దీంతో సమ్మె ఎఫెక్ట్ మెట్రోపై పడింది.

5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. తమకు 5 ఏళ్లుగా 11 వేల రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని.. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగంలో సరైన సమయం లేదని.. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొక రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడంలేదని ఆరోపించారు. దీంతో అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో.. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.ఈ సందర్భంగా మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది మాట్లాడుతూ, ప్రస్తుతం ధర్నా విరమిస్తున్నామని వివరించింది.

కియోలిస్ తో మరోసారి చర్చలకు రమ్మన్నారని,  ఈ రోజు సాయంత్రం కియోలిస్ ప్రతినిధులు వస్తామన్నారన్నారని మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది తెలిపింది. వేతనాలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశామని.. మరోసారి చర్చించిన తర్వాత మా నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.

గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ కియోలిస్‌ హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు, స్టేషన్స్ బాధ్యతలు చూస్తోంది. ఈ బాధ్యతలను ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ.. సబ్ కాంట్రాక్టు ద్వారా కియోలిస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థే ఉద్యోగ నియమాకాలు చేపట్టింది. అయితే.. జీతాల విషయంలో మాత్రం కియోలిస్ సంస్థ నిరక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.