‘సార్వభౌమత్వం’ డిమాండ్‌‌ వదులుకుంటేనే ఉల్ఫాతో చర్చలు

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) చీఫ్ పరేష్ బారువా శాంతి చర్చల విషయంలో ‘సార్వభౌమత్వం’ డిమాండ్‌‌ను వదులుకుంటేనే చర్చలకు వీలవుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. లేని పక్షంలో  ఆ సంస్థతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వంతో శాంతి చర్చలకు చొరవ చూపించనున్నట్టు పరేష్ బారువా ఇటీవల ప్రకటన చేసిన నేపథ్యంలో సీఎం తాజా వివరణ ఇచ్చారు.

”చర్చలకు కూర్చోవడమనేది పెద్ద విషయం కాదు. చర్చల టేబుల్ ముందుకు వారిని తీసుకురావడమనదే కష్టమైన పని. సార్వభౌమత్యం డిమాండ్‌ను పట్టుకుని పరేష్ బారువా వేలాడుకున్నంత కాలం ఉల్ఫాతో చర్చలు జరపడం అసాధ్యం. సార్వభౌమత్వం డిమాండే అసలు సమస్య. ఉల్ఫాతో సంప్రదింపులకు మార్గాలు తెరిచే ఉన్నాయి. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని సీఎం చెప్పారు.

ఉల్ఫా తిరుగుబాటు సమస్య పరిష్కారంలో అసోం ప్రజలు కీలక పాత్ర పోషించారని సీఎం ప్రశంసించారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని తాను ప్రమాణం చేసినందున శాంతి చర్చలకు ఎలాంటి ముందస్తు షరతును అంగీకరించలేమని స్పష్టం చేశారు.అసోం సౌర్వభౌమత్వ డిమాండ్‌ను ఉల్ఫా చీఫ్ వదులుకుని చర్చలకు వస్తే తాను కూడా చర్చలకు రాగలనని తెలిపారు. ఆయన ఎప్పుడు చర్చలకు వచ్చినా ప్రభుత్వం సిద్ధమేనని చెప్పారు.

కాగా, జీహాదీలు, మతోన్మాదులు, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం సాగిస్తోందని సీఎం చెప్పారు. ”సానుకూల ఆలోచనతో ముందుకు వచ్చే ముస్లింలను కలుపుకుంటున్నాం. మద్రసాలపై రాష్ట్ర పోలీసులు నిఘా ఉంచేందుకు ఈ చర్య ఉపకరించింది. జీహాదీలతో సంబంధాలున్న చాలామందిని పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు” అని చెప్పారు.

“గిరిజన తిరుగుబాటుకు 2022లో ముగింపు పలికాం. కబ్రీస్, డిమాసస్, ఆదివాసీ మిలిటెంట్ గ్రూపులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 757 ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి, 131 గ్రనేడ్లు, ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి” అని సీఎం వివరించారు. గత ఏడాది రూ.781 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల రవాణా కారిడార్‌గా స్మగ్మర్లు అసోంను ఉపయోగించుకుంటున్నారని, ఇంతపెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ద్వారా అసోం పోలీసులు కొరటా ఝళిపించారని పేర్కొన్నారు.