ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు

నాగపూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 

నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో ఉన్న ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తామంటూ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీస్ కంట్రోల్ రూముకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్యాలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.

అంగుళం అంగుళం క్షుణ్ణంగా గాలించారు. చివరికి బాంబు లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీడీడీఎస్, డాగ్ స్క్వాడ్ కార్యాలయానికి చేరుకుని తనిఖీలు నిర్వహించినట్టు డీసీపీ (జోన్ 3) గోరఖ్ భమ్రే తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్యాలయ పరిసరాల్లో పెట్రోలింగ్‌ను పెంచినట్టు చెప్పారు. కంట్రోల్ రూముకు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ఇదిలావుండగా, నూతన సంవత్సర వేడుకలతో సహా మెగాపోలిస్‌లోని కొన్ని ప్రదేశాలలో బాంబు పేలుళ్లకు బెదిరింపులకు పాల్పడినందుకు ముంబై నుంచి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి 8:56 నుంచి 9.20 గంటల మధ్య పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన నిందితుడు నరేంద్ర కవాలేను సెంట్రల్ ముంబైలోని ధారవి నుంచి అరెస్టు చేశారు. మద్యం మత్తులో కవాలే కాల్ చేశారని కూడా ఆయన చెప్పారు.