నాసిక్ జిందాల్ యూనిట్ లో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

మహారాష్ట్రలోని నాసిక్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముండేగావ్ గ్రామంలోని జిందాల్ గ్రూప్ పోలిథిన్ తయారీ యూనిట్‌లో మధ్యాహ్నం 11.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఇద్దరు మరణించగా, మరో 14 మంది గాయపడ్డారని, వీరిలో 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. 

కెమికల్ ప్లాంట్ బాయిలర్‌లో సంభవించిన పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. పలువురు ఫ్యాక్టరీలో చిక్కుకుపోవడంతో అధికారులు తక్షణ సహాయక చర్చలు చేపట్టారు. అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయి. 

భారత వాయుసేన హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసిందని, వర్కర్లు, సూపర్‌వైజర్ సహా 19 మంది గాయపడ్డారని నాసిక్ ఎస్‌పీ షాహ్జి ఉమాప్ తెలిపారు. 

నాసిక్ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని, గాయపడిన వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. కాగా, ప్రమాదానికి ఇతమిత్థమైన కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు.