2023 ప్రపంచ కప్ కు 20మంది ఆట‌గాళ్ల‌ షార్ట్ లిస్ట్

కొత్త ఏడాదిలో మొద‌టి రోజు ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ సాధ‌న దిశ‌గా తొలి అడుగు ప‌డింది. ఈసారి స్వ‌దేశంలో జ‌రుగుతున్న‌ ఐసీసీ టోర్నీలో విజేత‌గా నిల‌వాల‌నే లక్ష్యంతో జ‌ట్టు ఎంపిక మీద బీసీసీఐ దృష్టి పెట్టింది. ముంబైలోని బీసీసీఐ కార్యాల‌యంలో జ‌రిగిన‌ భార‌త జ‌ట్టు స‌మీక్షా స‌మావేశంలో బీసీసీఐ 20 మంది ఆట‌గాళ్ల‌ను షార్ట్ లిస్ట్ చేసింది.
 
అయితే.. వాళ్ల పేర్లు మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు వీళ్ల‌ను రొటేష‌న్ పద్థ‌తిలో ఆడించ‌నుంది. ఈ 20 మంది కాకుండా దేశ‌వాళీ టోర్నీల్లో అద్భుతంగా ఆడిన క్రికెట‌ర్‌ను సెల‌క్ట‌ర్లు వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టుకి ఎంపిక చేసే అవ‌కాశం కూడా ఉంది.
 
2011లో స్వ‌దేశంలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ధోనీ సార‌థ్యంలోని టీమిండియా విజేత‌గా నిలిచింది. దాంతో, ఈ ఏడాది కూడా ట్రోఫీ గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.
‘ఇది నిజంగా చాలా విజ‌య‌వంత‌మైన స‌మావేశం. భార‌త జ‌ట్టు గ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డంతో పాటు ఈ ఏడాది జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్, వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్  కోసం అవ‌స‌ర‌మైన‌ ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని ఓ అధికారి చెప్పారు.
 
తమ మొద‌టి ప్రాధాన్యం అంత‌ర్జాతీయ క్రికెట్‌కే. అలాగ‌ని ఐపీఎల్‌ను ప‌ట్టించుకోమ‌ని కాదని స్పష్టం చేశారు.  ఈమ‌ధ్య భార‌త జ‌ట్టు ఫీల్డింగ్ దారుణంగా ఉంటోంది. బంగ్లా సిరీస్‌లో కీల‌క‌మైన క్యాచ్‌లు వ‌దిలేయ‌డంతో వ‌న్డే సిరీస్ కోల్పోవాల్సి వ‌చ్చింది. దాంతో ఆట‌గాళ్ల ఫిట్‌నెస్ ప్ర‌మాణాలు త‌గ్గిపోయాన‌నే విష‌యాన్ని అధికారులు గుర్తించారు.
 
అందుక‌ని యోయో, డెక్సా స్కాన్ వంటి ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల‌ను ఇక‌పై ఆట‌గాళ్ల ఎంపిక ప్ర‌క్రియ‌లో భాగం చేయ‌నున్నారు. అంతేకాదు జాతీయ జ‌ట్టులో చోటు సంపాదించాల‌నుకునే యువ ఆట‌గాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల‌నే ప్ర‌తిపాద‌నకు అంతా ఒప్పుకున్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో, ఐసీసీ మెగా టోర్నీల్లో భార‌త ఆట‌గాళ్లు విఫ‌లం కావ‌డానికి ఐపీఎల్ ఒక కార‌ణం అనేవాళ్లు చాలామందే ఉన్నారు. దాంతో 2023 ఐపీఎల్‌లో ఆడే క్రికెట‌ర్ల మీద ప‌ని భారం పెర‌గ‌కుండా చూడడం కూడా బీసీసీఐ ఎజెండాలో ఉంది. అందుక‌ని జాతీయ క్రికెట్ అకాడ‌మీ, ఫ్రాంఛైజీల‌తో క‌లిసి క్రికెట‌ర్ల ఆరోగ్య‌ప‌రిస్థితిని అంచనా వేయ‌నుంది.