కర్ణాటకలో మూడింట రెండోతుల మెజారిటీ తధ్యం 

మరి కొద్ది నెలల్లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఒంటరిగా పోటీ చేయడమే  కాకుండా, మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా వ్యక్తం చేశారు.  బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్‌లో బీజేపీ బూత్‌ ప్రెసిడెంట్లు, బూత్‌ స్థాయి ప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ జేడీ(ఎస్)తో పొత్తు కోసం మాటలు జరుగుతున్నాయనే వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.

 “జేడీ(ఎస్)తో అనుబంధం ఉన్న కొందరు ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని వదంతులు ప్రచారం చేస్తున్నారు. దీనికి చాలా స్పష్టంగా సమాధానం చెబుతున్నాను. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది” అని స్పష్టం చేశారు. 

కాగా, జేడీఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని ఆయన హెచ్చరించారు. ఇది బిజెపి, కాంగ్రెస్ పార్టీల జరుగుతున్న ప్రత్యక్ష  ప్రత్యక్ష పోటీ అని పేర్కొంటూ కొందరు మీడియా మిత్రులు త్రిముఖ పోటీ అని వ్రాస్తుండటాన్ని కొట్టిపారవేసారు. దేశ భక్తుల పార్టీ అయిన బీజేపీ వైపు నిలబడతారో లేక తుక్డే తుక్డే గ్యాంగ్‌తో నిలబడతారో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు.

జేడీఎస్‌కు ఓటేయడం అంటే కాంగ్రెస్‌కి ఓటేయడమే అని అమిత్ షా పేర్కొంటూ జేడీఎస్‌తో బిజెపి పొత్తు పెట్టుకుంటుందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని కర్ణాటకలోని కార్యకర్తలకు, ప్రజలకు చెప్పేందుకు వచ్చానని అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, అవినీతికి పాల్పడటం కోసం అధికారాన్ని కాంగ్రెస్ కోరుకుంటుందని, తాము (బీజేపీ) మాత్రం ప్రజలకు మరింత మెరుగైన జీవనం కల్పించాలని కోరుకుంటామని చెప్పారు. ఇటీవల 7 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 6 రాష్ట్రాల్లో పత్తాలేకుండా పోయిందని గుర్తు చేశారు.

గుజరాత్‌లో బీజేపీ ఘనవిజయాన్ని ఎత్తిచూపిన అమిత్ షా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే, సగం మనసుతో దాన్ని ఏర్పాటు చేయవద్దని, మూడింట రెండు వంతుల పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండని బిజెపి శ్రేణులకు హితవు చెప్పారు. తాను కర్ణాటక ప్రజల మూడ్ చూశానని, వారు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వారి వద్దకు పార్టీ వెళ్లడమే జరుగవలసి ఉందని బిజెపి శ్రేణులకు సూచించారు. 

కాంగ్రెస్, జేడీఎస్ ఒకే నాణెంకు రెండు ముఖాలన్ని చెబుతూ, వారికి ఓటు వేస్తే కుమారస్వామి (జేడీఎస్) వెళ్లి కాంగ్రెస్ వారి వళ్ళో కూర్చుంటారని స్పష్టం చేశారు. 2018 ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా ఎన్నుకున్న ప్రజలు పూర్తి మెజారిటీకి బిజెపికి కొన్ని సీట్లు తక్కువగా ఇవ్వడంతో, ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న ఆ రెండు పార్టీలు బిజెపిని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయని అమిత్ షా గుర్తు చేశారు. 

కర్ణాటకను బిజెపికి `దక్షిణాదికి ముఖద్వారం’గా పేర్కొంటూ ఇటీవల తాను మండ్యాకు వెళ్ళినప్పుడు బిజెపి కొంతం బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్న పాత మైసూర్ ప్రాంతంలో మంచి ప్రజా స్పందన చూశానని ఆయన  చెప్పారు. మహాభారతలో అర్జునుడు బాణం వేసేటప్పుడు  ఎంత ఏకాగ్రతతో ఉండేవారో బూత్ అధ్యక్షుడు ఎన్నికల సమయంలో వాటిపై దృష్టి సారించాలని హితవు చెప్పారు. “మీరు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే, మోదీజి దేశాన్ని బలోపేతం చేస్తారు” అని భరోసా ఇచ్చారు. 

అధికారం కాంగ్రెస్ కు అవినీతికి సాధనమైతే, బిజెపికి ప్రజా సేవకు మార్గం అని అమిత్ షా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర బిజెపి అధ్యక్షడు నళిని కుమార్ కటీల్ , జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, సిటీ రవి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు.