లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు

* 1,644 అభ్యర్థులపై క్రిమినల్ కేసులు .. ఏడీఆర్ నివేదిక 

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  (ఏడీఆర్) తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం 359 మంది 5వ తరగతి వరకు చదివారు. 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చదువుకున్నారు. 

1,303 మంది అభ్యర్థులు తాము 12వ తరగతి ఉత్తీర్ణులయ్యామని, 1,502 మంది అభ్యర్థులు తాము గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించుకున్నారు.  డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. మొదటి దశ ఎన్నికలలో 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5, 12వ తరగతులని చెప్పగా.. 836 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. 26 మంది నిరక్షరాస్యులని చెప్పారు.

నలుగురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు. రెండో దశలో 533 మంది అభ్యర్థులు తమ విద్యా స్థాయిలు 5,12వ తరగతుల మధ్య ఉన్నాయని ప్రకటించగా, 574 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదివామని వెల్లడించారు. దాదాపు 37 మంది అక్షరాస్యులమని, ఎనిమిది మంది నిరక్షరాస్యులని చెప్పగా ముగ్గురు తమ విద్యార్హతలను అందించలేదు.

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 1,644 మంది క్రిమినల్స్గా తేలారు. చాలామంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 1,188 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను పరిశీలించినట్లు ఏడీఆర్ తెలిపింది.

లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1,618 మంది అభ్యర్థులు పోటీ పడగా  అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 161 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక రెండో దశలో మొత్తం 1,192 మంది అభ్యర్థులు పోటీ పడగా 250 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. ఇందులో 167 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

లోక్‌సభ మూడవ దశ ఎన్నికల్లో 1,352 మంది అభ్యర్థులు పోటీ చేయగా 244 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 172 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో జరిగిన నాలుగవ దశలో అత్యధికంగా 1,710 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో 360 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 274 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.

ఐదవ దశలో 695 మంది అభ్యర్థులు పోటీ పడగా 159 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 122 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది. 6వ దశలో పోటీ పడే 866 మంది అభ్యర్థుల డేటాను విశ్లేషించగా 180 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా గుర్తించామని ఏడీఆర్ డేటా పేర్కొంది. వారిలో 141 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని పేర్కొంది. 

చివరిదైన 7వ దశలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 199 మందిపై కేసులు ఉన్నాయి. వారిలో 151 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. కాగా మే 25న 6వ దశ, జూన్ 1న తుది దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.