చైనాలో కరోనా విజృంభణపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

చైనాలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్‌ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్‌పై చర్యలు చేపట్టాలని సూచించారు. చైనా ఆరోగ్య వ్యవస్థల పరిరక్షణకు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామని చెప్పారు.

కాగా, చైనాలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఆ దేశం నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీ చేశాయి.  ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ దీనిపై కూడా స్పందించారు. చైనాలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదు గురించి సరైన సమాచారం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ పలు దేశాలు ముందు జాగ్రత్తగా పలు చర్యలు చేపడుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్ల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. కరోనా గురించి అర్థం చేసుకోవడంలో ఏర్పడే గ్యాప్‌ వల్ల భవిష్యత్తులో సంభవించే మహమ్మారిలను అర్థం చేసుకోవడం, ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని తెలిపారు.

వైర‌స్ విష‌యంలో అబద్ధాలను ప్రచారం చేయొద్దని ఘేబ్రియేసస్ హితవు చెప్పారు.  చైనా ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందంతో ఘేబ్రియేసస్ తాజాగా సమావేశమైన సందర్భంగా చైనాలో ప్రస్తుత పరిస్థితిని ప్రపంచానికి వెల్లడించాలని ఆయన కోరారు. వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలు, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనాతో ఆసుపత్రులకు చేరిన వాళ్ల సంఖ్య, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఎంతమంది, కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ లెక్కలు.. తదితర వివరాలను ప్రపంచానికి వెల్లడించాలని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో వైరస్ వేరియంట్ల పరిశీలన, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్స, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని చెప్పారు.కరోనాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో కలిసి పనిచేయాలంటూ చైనా శాస్త్రవేత్తలకు ఘేబ్రియేసస్ పిలుపునిచ్చారు. వైరల్ సీక్వెన్సింగ్ పై జనవరి 3న నిర్వహించబోయే సమావేశంలో పాల్గొనాలని కోరారు.

ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసులు, వేలల్లో కరోనా మరణాలు నమోదవుతున్నా ఈ గణంకాలను చైనా అధికారికంగా విడుదల చేయడం లేదు. కాగా, బ్రిటన్‌కు చెందిన ఒక ఆరోగ్య సంస్థ చైనాలో నమోదవుతున్న కేసులు, మరణాల డాటాను గురువారం వెల్లడించింది. డిసెంబర్‌ 1 నుంచి నెలాఖరు వరకు 1.86 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు తెలిపింది.

అలాగే ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరినట్లు పేర్కొంది. గత వారం కంటే కరోనా మరణాలు రెట్టింపు అయ్యాయని, పత్రి రోజూ సుమారు 9 వేల మరణాలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త ఏడాది జనవరిలో చైనాలో మరింతగా కరోనా విజృంభిస్తుందని బ్రిటన్‌కు చెందిన ఆ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

జనవరి 13 నాటికి కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరుతాయని, రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. అలాగే జనవరి 23 నాటికి రోజువారీ కరోనా మరణాల సంఖ్య 25,000కు పెరుగుతుందని పేర్కొంది. చైనాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,84,000కు చేరవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.