అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు.. ఓయూ విద్యార్థి నేతపై దాడి 

హిందూ దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై భారత నాస్తిక సమాజ ప్రతినిధి, ఓయూ విద్యార్థి  భైరి నరేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అతని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడిక్కడ ఆందోళన నిర్వహించి బైరి నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోస్గి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బైరి నరేశ్‌పై అయ్యప్ప స్వాములు దాడి చేశారు. ఆయన్ను రోడ్డుపై పరిగెత్తించుకుంటూ కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అయ్యప్ప భక్తులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం అక్కడి నుంచి బైరి నరేశ్‌ కారులో పరారయ్యాడు.

కాగా ప్రస్తుతం బైరి నరేష్ పరారీలో ఉండగా..పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అతని కుటుంబసభ్యులను విచారించిన పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం లోపు లొంగిపోతానని నరేష్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు నేడు వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

నిర్మల్‌లో అయ్యప్పస్వాములు నిరసనకు దిగారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బైరి నరేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోనూ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. హైదరాబాద్‌బీజాపూర్ జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. చేవెళ్ల, మొయినాబాద్‌లో రోడ్డుపై నిరసనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

మరోవైపు బైరి నరేష్‌పై పోలీసులు 4 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నరేష్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి హెచ్చరించారు. మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఎవరైనా మీటింగ్ లు పెట్టుకున్నప్పుడు ఇలాంటి వారిని ప్రోత్సాహించవద్దు. అలాంటి వారిని పిలవొద్దని సూచించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిని వదిలిపెట్టేది లేదని కోటిరెడ్డి హెచ్చరించారు.  మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. 

శాంతికి విఘాతం కలిగించే వారిని సభలు, సమావేశాలకు పిలవొద్దని ఎస్పీ సూచించారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో మెలగాలని సమాజంలో శాంతికి దోహదపడాలని తెలిపారు. సున్నితమైన అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎస్పీ తేల్చి చెప్పారు.ఇదిలా ఉంటే నిన్న బైరి నరేష్ మరో వీడియోను అప్ లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా అతని ఆచూకీని ట్రేస్ చేస్తున్నారు.

పవిత్రమైన హిందూ దేవి దేవతలను దూషిస్తూ ఘోరంగా అవమానించిన దుర్మార్గుడిపై పిడి చట్టం క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. నాస్తికుల పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన సంస్థను నిషేధించాలని పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, ధర్మ ప్రసార రాష్ట్ర సహా ప్రముఖ్ సుభాష్ చందర్ స్పష్టం చేశారు. ఇతర మతస్థులను పల్లెత్తు మాట అనే ధైర్యం చాలని నాస్తికులు హిందువులను  మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.