గత ప్రభుత్వ రుణాలు తమకు శాపాలంటూ ప్రధానికి జగన్ ఫిర్యాదు

గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను తమ  ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోవాల్సిన రుణాలపై పరిమితి విధిస్తోందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసారు. 

బుధవారం ప్రధానిని కలిసి 45 నిముషాలమేరకు  భేటీలో గతంలోని టిడిపి పాలనపై విమర్శలు గుప్పిస్తూ, వారి చేసిన పనుల కారణంగానే ప్రస్తుతం కేంద్రం తమపై రుణపరిమితి ఆంక్షలు విధిస్తున్నదని, కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఆంక్షలు విధిస్తూ ఈ ప్రభుత్వాన్ని శిక్షిస్తోందని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు.

కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92  కోట్లను రెండేళ్లుగా చెల్లించలేదని ముఖ్యమంత్రి  ప్రధానికి చెప్పారు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన్ను కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశం కూడా ఇంకా పెండింగులోనే ఉందని గుర్తు చేశారు. 

మొత్తం ప్రాజెక్టు కోసం రూ.55,548 కోట్లు ఖర్చవుతుందని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తుచేసిన సీఎం, తాగునీటి సరఫరా అంశాన్ని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరారు. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా తాగునీటి వ్యవహారాన్ని ప్రాజెక్టులో అంతర్భాగంగానే చూశారని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి అందజేసిన వినతి పత్రాలపై సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రధానితో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు దాటిందని గుర్తు చేసిన సీఎం, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపారు. 

ఈ అంశంపై గతంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమైందని, కొంత పురోగతి సాధించినప్పటికీ, కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు.