చంద్రబాబు సభలో  తొక్కిసలాటలో 8 మంది మృతి

‘‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో సభకు హాజరైన సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. కందుకూరు సభా ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికి ఎనిమిది మంది కార్యకర్తలు చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ తొక్కిసలాటలో చాలామంది ఒక్కసారిగా కాల్వలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మొదటి ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత మరో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

ఈ ఘటన పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

అప్పటికప్పుడు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. రోడ్ షో కొనసాగుతున్న సమయంలో భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. బాధితులను చంద్రబాబు హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు.  సభకు పక్కనే కాల్వ ఉండడం.. ఈ క్రమంలో సభకోసం వస్తుండగా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. దీంతో చాలామంది కార్యకర్తలు కాల్వలో పడిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 ప్రధాని సంతాపం 

 నెల్లూరు జిల్లా బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాననితెలిపారు . క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాగే మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.