క‌ర్ణాట‌క‌లో మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేసిన ప్ర‌భుత్వం

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. థియేట‌ర్లు, విద్యా సంస్థ‌లు, బార్లు, రెస్టారెంట్ల‌లో మాస్కులు ధ‌రించిన వారికే అనుమ‌తి ఇవ్వాల‌ని ఆదేశించింది.
కొత్త ఏడాది వేడుక‌ల్లో మాస్కులు త‌ప్పనిస‌రి చేసింది. జాగ్ర‌త్త ఉండాల‌ని, ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.
కరోనా అదుపులోనే ఉంద‌ని, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.  అయితే నూతన సంవత్సర వేడుక‌లు అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మాత్ర‌మే నిర్వ‌హించుకోవాల‌ని ఆదేశించింది. ఆ త‌ర్వాత వేడుక‌లను నిర్వ‌హిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.
నూతన సంవత్సర వేడుక‌ల వేళ‌.. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాక‌ర్ స్ప‌ష్టం చేశారు. గ‌ర్భిణులు, పిల్ల‌లు, వృద్ధులు.. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిర‌గ‌కూడ‌ద‌ని సూచించారు. ప‌రిమితికి మించి జ‌నాల‌ను ఇండోర్ ఈవెంట్స్‌కు అనుమ‌తించొద్ద‌ని స్పష్టం చేశారు.
 
12 మంది విమాన ప్రయాణీకులకు కరోనా 
కాగా, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన 12మంది ప్రయాణికులకు కరోనా వైరస్ ఉన్నట్లు పరీక్షల క్రమంలో నిర్థారణ అయింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పలు దేశాల నుంచి వచ్చినవారే కరోనాకు గురయినట్లు స్పష్టం అయింది. వీరిలో చైనా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కూడా కరోనా ఉన్నట్లు నిర్థారణ కావడంతో బెంగళూరులో ఉన్నత స్థాయిలో అధికారులు అప్రమత్తం అయ్యారు.

చైనా నుంచి వచ్చిన ఓ 37 ఏండ్ల వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్లు తేలింది. మిగిలిన 11 మంది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలలలో పర్యటించి వచ్చిన వారే. కరోనా సోకినట్లు నిర్థారణ అయిన వారిని చికిత్సకు పంపించగా, మిగిలిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు.

కరోనా నిర్థారణ అయిన వారి రక్తనమూనా పరీక్షల శాంపుల్స్‌ను వెంటనే వైరాలజీ ఇనిస్టూట్‌కు పరీక్షలకు పంపించారు. వీటి ఫలితాలు వస్తే వైరస్ తీవ్రత ఏమిటనేది తేలుతుంది. శనివారం చైనా నుంచి యుపిలోని ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఆయనను క్వారంటైన్‌కు పంపించారు. ప్రస్తుత చైనా వైరస్ భయాల దశలో విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో భారీ స్థాయిలో పరీక్షలకు ఏర్పాట్లు జరిగాయి.