కుత్రిమ గుండె తయారు చేసిన కాన్పూర్ ఐఐటీ

గుండెపోటుకు గురైన వ్యక్తిని ఆపదలో ఆదుకునేందుకు కాన్పూర్‌లోని ఐఐటీ వైద్యనిపుణులు కృత్రిమ గుండెను తయారు చేశారు. దీని ద్వారా వేగంగా గుండెను మార్పిడి చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో రెండేళ్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కేజీఎంయూ 118 వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ఐఐటీ కాన్పూర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అభయ్ కరాండికర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరిపిన అనంతరం రానున్న రెండేండ్లలో మనుషులకు కృత్రిమ గుండెను అమర్చేలా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా గల హుద్రోగ నిపుణలతో కలసి ఐఐటి కాన్పూర్ దీనిని తెయారు చేసిందని చెబుతూ అందుకోసం శాస్త్రవేత్తలు, వైదులతో కూడిన పది మంది బృందం కృషి చేసిందని చెప్పారు.  శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా రక్తాన్ని అందించడం ఈ కృత్రిమ గుండెతో సాధ్యమయ్యేలా చేస్తున్నామని, ఈ పరిశోధన విజయవంతమైతే గుండె మార్పిడి మరింత సులువవుతుందని ప్రొఫెసర్‌ అభయ్‌ కరాండికర్‌ చెప్పారు.

ఇది ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నదని, త్వరలోనే జంతువులపై పరిశోధనలు చేపడతామని పేర్కొన్నారు. మన దేశంలోని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి అనేక కొత్త చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, విదేశాల నుంచి రూ.10-12 లక్షలకు వచ్చే వెంటిలేటర్లను కేవలం 90 రోజుల్లోనే సిద్ధం చేసి రూ.2.5 లక్షలకు అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు.

మన దేశంలో గుండె జబ్బులకు సంబంధించి అవసరమైన 20 శాతం పరికరాలు మాత్రమే తయారవుతున్నాయని, 80 శాతం ఇంప్లాంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. మన దేశంలో ఆరోగ్య కార్యకర్తల కొరత వేధిస్తున్నదని, ప్రతి వేయి మందికి 0.8 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారని అభయ్‌ కరాండికర్‌ చెప్పారు.

దీనిని అధిగమించేందుకు కృత్రిమ మేధస్సు, టెలిమెడిసిన్‌, ఈసంజీవని, ఈఫార్మసీ వంటి టెక్నిక్‌లను అభివృద్ది చేయాల్సిన అవసరమున్నదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న 5 జీ తో లింక్‌ చేయడం వల్ల ఎక్కువ మంది రోగులకు సరైన చికిత్స అందించే వీలుంటుందని ఆయన తెలిపారు.