మాస్క్ లు ధరించండి.. చేతులను శుభ్రం చేసుకోండి

మాస్క్ లు ధరించండి.. చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పొరుగుదేశం చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలను తీవ్రతరం చేసింది. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే విదేశీ ప్రయాణికులను ర్యాండమ్ గా పరీక్షిస్తున్నారు. 
 
శనివారం సుమారు 25 వేల మంది ప్రయాణికులు రాగా, వారిలో 500 మందిని పరీక్షించారు. ప్రజలు వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు వీలుగా నివారణ చర్యలు పాటించాలని మోదీ కోరారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ సూచన చేశారు.
 
“చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడాన్ని చూస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ లు ధరించి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి” అని  ప్రధాని కోరారు. 
ఈ ఏడాది చివరి ‘మన్‌ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలామంది సెలవులకు వెళ్తుంటారని, కరోనా బారిన పడకుండా వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వీయ రక్షణే కరోనాకు మందు అని చెబుతూ జాగ్రత్తగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా జీరో-కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేయడంతో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్తోందని చెప్పారు.
భారతదేశం 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్‌లు ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించిందని, గ్లోబల్ ఎకానమీలో ఐదో స్థానంలో నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. ఎగుమతుల విషయంలోనూ 400 బిలియన్ డాలర్ల విలువచేసే మేజికల్ ఫిగర్‌ను సాధించిందని చెప్పారు.
 
 అంతరిక్ష, రక్షణ, డ్రోన్ రంగాల్లో కొత్త పుంతలు తొక్కిందని, క్రీడల్లోనూ విజయాలను సొంతం చేసుకున్నామని తెలిపారు. ఎంతో అద్భుతమైన సంవత్సరం 2022 అని, 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాలతో అమృత్ కాల్ మొదలైందని, దేశం శీఘ్రగతిన పురోగతిన సాధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. 
 
భారత్ జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే బాధ్యతను తీసుకుందన్న మోదీ  2023లో జి 20 సదస్సును మరో లెవెల్‌కి తీసుకెళ్దామని పేర్కొన్నారు.  అటు నమామీ గంగా మిషన్ ద్వారా పర్యావరణం మెరుగైందని, స్వచ్ఛ భారత్ మిషన్ భారతీయుల మెదళ్లలో దూసుకుపోయిందని చెప్పారు. 
గత కొన్నేళ్లుగా ఆరోగ్యరంగంలో అనేక సవాళ్లను తాము అధిగమించామని, ఆటలమ్మ, పోలియా వంటి వ్యాధులను నిర్మూలించామని ప్రధాని చెప్పారు. కాలా అజర్ వ్యాధిని తరిమికొట్టామని పేర్కొంటూ ఇప్పుడు ఆ వ్యాధి బీహార్, జార్ఖండ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైందని చెప్పారు.
మరోవైపు ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను  తెలుసుకునేందుకు మంగళవారం నుంచి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.  ఒకేసారి కేసులు పెరిగిపోతే వచ్చే రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, లైఫ్ సపోర్ట్ యాంత్రాల పనితీరును చెక్ చేసుకోవాలని కోరింది.