నటి తునిషా శర్మ ఆత్మహత్య వెనుక `లవ్ జిహాద్’!

ఓ టీవీ సీరియల్‌ షూటింగ్ సెట్‌లో మహారాష్ట్ర టీవీ సీరియల్ నటి తునిషా శర్మ (20) శనివారం ఆత్మహత్య చేసుకోవడానికి లవ్ జిహాద్ కారణం అనే కధనాలు వెలువడుతున్నాయి. ఆమెకు ఆర్ధిక సమస్యలు గాని, వృత్తిపరమైన ఇతర సమస్యలు గాని లేవని సహచరులు స్పష్టం చేస్తున్నారు. 
 ఆమె సహ నటుడు షీజాన్‌ ఖాన్‌ను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని ముంబైలోని వాసాయ్‌ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఆత్మహత్య వెనుక లవ్ జిహాద్  కోణంపై దర్యాప్తు జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

 ఆమె ఆత్యహత్య చేసుకునేవిధంగా ఖాన్ ప్రేరేపించినట్లు కేసు నమోదైంది. ‘అలీ బాబా : దాస్తాన్-ఈ-కాబూల్’ టీవీ షో సెట్స్‌లో తునిషా శర్మ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లా, వాసాయ్‌లో ఈ సంఘటన జరిగింది.  ఆమె ఆత్యహత్య చేసుకునే విధంగా ఖాన్ ప్రేరేపించినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

తునిషా, ఖాన్ మధ్య రిలేషన్‌షిప్ ఉందని, వీరిద్దరూ 15 రోజుల క్రితం విడిపోయారని, ఆమె ఆత్మహత్యకు కారణం ఇదే కావచ్చునని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఈ పరిణామంతో తునీషా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైందని, దాంతోనే చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు.తునీషా ఆత్మహత్య చేసుకునేలా షీజాన్‌ ఖాన్‌ ప్రేరేపించినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత రామ్ కదమ్ మాట్లాడుతూ, తునిషా శర్మ ఆత్మహత్య కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటని ప్రశ్నించారు. దీనిలో లవ్ జిహాద్ ఉందా? లేదంటే వేరొక కారణం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. 

ఇది లవ్ జిహాద్ కేసు అయితే పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తారని, ఈ లవ్ జిహాద్ వెనుక ఏ సంస్థలు ఉన్నాయి? కుట్రదారులు ఎవరు? అనే అంశాలను తెలుసుకుంటారని ఆయన వివరించారు. ఇదిలావుండగా, ఈ కేసులో ప్రశ్నించేందుకు పార్థ్ జుట్షి అనే మరొక సహ నటుడిని కూడా పోలీసులు ఆదివారం పిలిచారు.